పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతుంది...
- ఎవరూ చూస్తలేరనుకుంటుందా?. చూస్తేంది... అని బరి తెగించి తాగుతుందా?.
ఈనాడులో చీకటి రోజులొచ్చి చాల్రోజులైంది. కాకపోతే యాజమాన్యానికి ఇవి వెన్నెల రాత్రులనుకోండి. ఓ సంకన చంద్రబాబు, ఇంకో సంకన మోడీ. మరి తెలంగాణ సీఎం... భుజం మీదుండా, వాళ్ల నెత్తి మీదుండా... అసలు గాయనకు, వీళ్లకు టచ్ ఉందా?. ఇవన్నీ ఓ సగటు ఈనాడు ఉద్యోగిని వేధిస్తున్న సందేహాలు. తెలంగాణ సిద్ధాంతపరంగానైతే ఇద్దరి మధ్య సఖ్యత ఉండొద్దు. గీ సమీకరణాలతోనైనా చట్టం తన పని తాను చేస్తుందని పాపం... బలవంతంగా రాజీనామాలు చేసి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని సెక్యూరిటీ గార్డులు కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ తిరిగిండ్రు. తొలుత గాండ్రించిన చట్టం రెండ్రోజుల్లోనే తోక ముడిచింది. మరి ఇలా ఎందుకు జరిగిందో తెలియక భూత, వర్తమాన, భావి ఈనాడు బాధితులంతా అయోమయంలో పడిపోయారు.
ఈ సమయంలో చకాచకా అడుగులు వేసిన ఈనాడు యాజమాన్యం గార్డుల రాజీనామాలు ఆమోదించి, వాళ్ల అకౌంట్లళ్ల సెటిల్‌మెంట్ డబ్బులు వేసింది. సెక్యూరిటీ గార్డులకు అనుకున్న దానికంటే అదనంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షలకు పైగానే అకౌంట్‌లో వేశారట. దీంతో ఆ సెక్యూరిటీ గార్డుల్లో కొందరు... సర్కారు పులి గాండ్రింపునకు భయపడి ఎక్కువ వేశారని అనుకున్నారు. ఇంకొందరు అరె మా యాజమాన్యంలోని అకౌంటెంట్లు తప్పుడు లెక్కలు చేసి ఈనాడు ఖజానాను ఖరాబ్ చేస్తుండ్రని ఫో్న్ చేసి మరీ తమకు ఎక్కువ మొత్తం పడింది... వెనక్కి తీసుకోండని స్వామిభక్తిని చాటుకున్నారట. కానీ కసాయి వాడు కసాయి వాడే కదా. వాన్లెక్కలు వాన్కీ ఉంటయి... అందుకే అదేం లేదు. మీకు వేజ్‌బోర్డు అమలు చేసినందున ఏరియర్స్ ఇచ్చాం. అదే గా ఎక్కువ అని చెప్పారు. కాస్త సంతోషం కాకపో్తే ఐదేళ్లలోపోళ్లకు 2-3వేలు నెలకు పెరిగాయట. ఆపై సీనియార్టీ వాళ్లకు ఒక్క పైసా కూడా పెరగలేదట. ఎందుకంటే రాష్ట్రంల ఎక్కడ కూడా ఈనాడు ఆఫీసులు నగరాలు, పట్టణాల్లో లేవు. అన్నీ ఎవరో తరిమేసినట్లు గ్రామపంచాయతీలకు బైలెల్లిపోయినవి. అందుకే హెచ్చార్యే, ట్రాన్స్‌పో్ర్టు అలవెన్స్ ఇలా అన్నీ కోతలు పడటంతో నయాపైసా పెరగలేదు. కానీ యాజమాన్యం మాత్రం వేజ్‌బోర్డు అమలు చేశామని జులుం చెలాయించడానికి మార్గం సుగమమైంది.
ఇక ఎడిటోరియల్ మిత్రులు ఈ చేదు అనుభవంలోనూ ఓ తీపి గుళికను వెలికి తీసి, తృప్తి పడుతున్నారు. అదేంటంటే... సెక్యూరిటీ గార్డులకు వేజ్‌బోర్డుతో సెటిల్ చేశారంటే మాకూ వేజ్‌బోర్డు ఇస్తారు కదా అని సూత్రీకరించుకున్నారు. ఈ సమయంలో ఇస్తారో ఇవ్వరో తెలియని బో్నస్ రెక్కలు కట్టుకొని వాలింది. కాకపోతే అందులో చిన్న పితటాకం. ఇప్పుడే కాదు రెండు, మూడేళ్ల కిందట ఇచ్చిన బోనస్ (యాజమాన్యం భాషలో ఎక్్సగ్రేషియా)ను కూడా మున్ముందు ఇచ్చే బెనిఫిట్స్‌లో సర్దుబాటు చేస్తామని సావుకబురు సల్లగ చెప్పిండ్రు. అయినా ఇందులో మరో సంతోషం. అదేంటంటే వేజ్‌బోర్డు అమలే కాదు ఏరియర్స్ కూడా ఇస్తున్నారట అని మిత్రులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదైతేనేం... పండుగకు బోనస్, వేజ్‌బోర్డు అమలుతో జీతం, అసలు రాదవనుకున్న ఏరియర్స్ కోతలతోనైనా వచ్చే సంకేతాలు. ప్రస్తుతానికి విరామమో... మరో రకమైన అంతరాయమో... అల్లంత దూరాన ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి బతుకుజీవుడా... అని సోమవారమే ప్రస్థానాన్ని ప్రారంభించిన మిత్రులకు కొంత ఊరట.
సాటి మనిషిగా నాకూ ఇవి తాత్కాలికమైనా సంతోషకర అంశాలే. కానీ మిత్రులు యాజమాన్యం కుట్రలను ముందే గుర్తించాలని, దీనికి ఇతర జర్నలిస్టు సంఘాలు కూడా తోడు రావాలని ఓ పరిణామాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నాల్రోజుల కిందట ఈనాడు యాజమాన్యం బో్నస్ కోసం వెల్లడించిన ప్రకటనలో *ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ఎండీ కిరణ్* అని ఉంది. ఇది ప్రమాదానికి సంకేతంగా గోచరిస్తుంది. వాస్తవంగా న్యూస్‌టుడే కింద ఉన్న ఎడిటోరియల్ వాళ్లను లాభాల్లో ఉన్న ఉషోదయ పబ్లికేషన్స్ కిందకు తెచ్చారు. అప్పుడు అందరితో సంతకాలు తీసుకున్నారు. అప్పుడు ఎండీ కిరణ్ అని ఉంది. మరి నష్టాల్లో ఉన్న ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ఈనాడు ముంగిటకు ఎలా వచ్చింది?. గతంలో దీని ఎండీ సురేష్ ఉన్నారు. ఇప్పుడు కిరణ్ అయితే కావచ్చు. కానీ దానికీ, ఈనాడు ఎడిటోరియల్ ఉద్యోగస్తులకు ఏం సంబంధం?. ఎలాంటి పంగనామాలు పెట్టేందుకు యాజమాన్యం సిద్ధమవుతుంది?. దీనిపై జర్నలిస్టు మిత్రులు పో్రాడాలి. ఎందుకంటే అందరి మౌనమే... యాజమాన్యానికి బూస్టులా పని చేస్తుంది. లేకుంటే ఈనాడులో 28, 29 తేదీల్లో పడే జీతం, 25 తేదీకల్లా వచ్చే పే స్లిప్‌లు 30 తేదీకి కూడా అతీగతీ లేవంటే యాజమాన్యం ఎంత పెద్ద కుట్ర చేస్తుందోనని ఈనాడు వాసన తెలిసిన ప్రతి ఒక్కరికీ అనుభవంలోనిదే. ఒకవైపు మెట్రో కథలతో తెలంగాణ సర్కారును ఆడించాలని చూస్తున్న ఈనాడు యాజమాన్యం వేగంగా ఉద్యోగులను వీధుల్లోకి నెట్టేందుకు పావులు కదుపుతుంది. గతంలో రామోజీని ఏమన్నా... వేలాది మందికి ఉపాధి ఇస్తున్నారు ఆయన్ని ఎవరూ ఏమనొద్దు అనేవారు. మరి ఇప్పుడు వేలాది మంది ఉసురు పోసుకుంటున్నాడు. ఇప్పడేమనాలి?. మేధావులు, ప్రభుత్వాలు, జర్నలిస్టు సంఘాలు, కవులు, రచయితలు ఎవరూ మౌనాన్ని వీడకపోతే ఎలా?. కొందరికి వ్యతిరేక వార్తల భయం, మరికొందరికి మా వార్తలు కవర్ కావనే ఆందోళన... అంటే ఒక్క పత్రిక ఉంటే తోక ఎంతపెద్ద శరీరాన్ని అయినా ఆడించొచ్చన్న మాట.