1

1

Monday 9 February 2015

కేజ్రీవాల్... లేచి ప‌డి మ‌ళ్లా లేస్తోన్న‌ కెర‌ట‌మే.. !!

కేజ్రీవాల్ లేచి ప‌డి మ‌ళ్లా లేస్తోన్న‌ కెర‌ట‌మే.. !!
తెలంగాణ‌లో ఆమ్ తెలంగాణ పార్టీ వ‌చ్చే వ‌ర‌కూ టీఆర్ఎస్‌కు అడ్డుఉండ‌క‌పోవ‌చ్చు..
-----------------------------
రేప‌టి ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసిన త‌ర్వాత లోక్‌స‌త్తా పార్టీ , దేశంలోని ఇత‌ర రాజ‌కీయ పార్టీలూ ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి... లోపం ఎక్క‌డ ఉందో ఆలోచించుకోవాలి... కేజ్రీవాలుకు నేనే స్ఫూర్తి అన్న డైలాగులు కాకుండా తొమ్మిదేళ్ల‌లో ఎందుకు జ‌నంలోకి వెళ్ల‌లేక‌పోయామో ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకొని ముంద‌డుగు వేయాలి... కేవ‌లం ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు, టీవీ చ‌ర్చ‌లే రాజ‌కీయ నాయ‌కుల‌కు ముఖ్యం కాదు.. జ‌నంలో ఉండాలి.. ఓట‌మితో నైరాశ్యంలోకి వెళ్ల‌డం, జ‌నానికి తెలివి లేద‌ని భావించ‌డం మూర్ఖ‌త్వం అవుతుంది.. కేజ్రీవాల్ తొలుత గెలిచిన‌ప్పుడు ఏదో హ‌వా అనుకున్నారు.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఆప్ ప‌ని అయిపోయింద‌న్నారు.. అయినా జ‌నాన్నే న‌మ్ముకున్నారు కేజ్రీవాల్‌.. ఢిల్లీ గ‌ల్లీలో వీధివీధినా తిరిగారు.. అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవ‌డానికి మొత్తం చూడ‌న‌క్క‌ర లేదు అన్న‌ట్లుగా.. అలాగే ఆయ‌న పాల‌న 49 రోజులే సాగినా జ‌నాన్ని ఆక‌ట్టుకుంద‌న్న‌ది అర్థం అవుతోంది.. ముఖ్యంగా అవినీతి లేకుండా చేయడంలో కృత‌కృత్యుల‌య్యారు..
ఇక బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థి మోడీనే స‌వాల్ చేయ‌డం.. ఎక్క‌డా కూడా వెన‌క్కి త‌గ్గ‌కుండా పోటీ చేయడం, ఓడిపోయినా త‌న పోరాటాన్ని ఆప‌క‌పోవ‌డం కేజ్రీకే చెల్లింది.. ఓట‌మి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకున్నాడు.. ఎన్నిక‌ల స‌మ‌రాంగ‌ణంలో ఏ బీజేపీ, మోడీ చేతుల్లో పరాభ‌వానికి గుర‌య్యాడో.. ఇప్పుడు వారికే ప‌క్క‌లో బ‌ళ్లెంలో మారబోతున్నారు..
కార్పొరేట్ కుబేరుల అండ‌దండ‌లున్న అధికార ప‌క్షానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు.. రేపు విజ‌యం లాంఛ‌న‌మే అని ఢిల్లీ వ‌ర్గాలు గుస‌గుస‌.. అదే నిజ‌మైతే వ‌రుస విజ‌యాల‌తో ఊపు మీద ఉన్న వారికి అడ్డుక‌ట్ట వేసిన‌వాడు అవుతాడు..ఒక‌వేళ ఆయ‌న గెలిస్తే.. ఇది కేజ్రీవాల్ విజ‌యమే కాదు.. సామాన్య ప్ర‌జ‌ల‌(ఆమ్ ఆద్మీ) విజ‌యం కూడా..
ప‌డి లేచిన కెర‌టాల‌ను చూస్తాం.. కేజ్రీవాల్ అయితే లేచి ప‌డి మ‌ళ్లా లేచిన కెర‌టం...
నాకు తెలిసి ఏ రాజ‌కీయ నాయ‌కుడు కూడా ఆయ‌న‌న్ని చెంప‌దెబ్బ‌లు, చెప్పుదెబ్బ‌లు తిన‌లేదు.. ఎన్ని దెబ్బ‌లు తిన్నా నిర్భ‌యంగా జ‌నంలోనే ఉన్నాడు.. అదే ఆయ‌న విజ‌య ర‌హ‌స్యం..
-----------------------------
నోట్‌: తెలంగాణ‌లోనూ తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే మ‌రో ప్ర‌త్యామ్నాయం వ‌చ్చే వ‌ర‌కు టీఆర్ఎస్‌కు అడ్డు ఉండ‌క‌పోవ‌చ్చు.. తెలంగాణ‌లో విశ్వ‌స‌నీయంగా ప‌నిచేసే మ‌రిన్ని స్థానిక పార్టీలు రావాలి...!!

No comments:

Post a Comment