1

1

Monday, 13 October 2014

గంద‌ర‌గోళంలో ఓటి మ‌ల్ల‌న్న‌లు!

రాజ‌కీయం రంగులు మార్చుతోంది. ఏనుగులు కొట్లాడిన ఈ తెలంగాణ గ‌డ్డ‌పై పీనుగులు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిన్న‌టిదాకా ప‌ర‌మ‌ప‌ద సోపానంలో త‌మ భ‌విష్య‌త్తు అంతా నిచ్చెన‌లే అని ఊహించిన ఒక నేత‌... నిన్న‌టిదాకా రాజ‌కీయం నాతో ఆడుకుంటే నేను ఇప్పుడు ఉద్యోగుల‌తో ఆడుకుంటానంటూ ఇంకో రాజ‌గురువు... ఇద్ద‌రూ ఇప్పుడు జ‌ర్న‌లిస్టుల జీవితాల‌తో ఆడుకుంటున్నారు. ఎన్నిక‌ల‌య్యేదాకా ఇష్టానుసారంగా జీతాలిచ్చి ఉద్యోగాల్లో పెట్టుకున్నారు. చివ‌ర‌కు ఇప్ప‌డు మంది ఎక్క‌వ‌య్యారంటూ పొమ్మ‌న‌లేక పొగ పెడుతున్నారు. నిన్న ఈనాడు... తాజాగా సాక్షిలో వేటుప‌ర్వం కొన‌సాగుతోంది. హైద‌రాబాద్, వ‌రంగ‌ల్ ఎడిష‌న్లు మాత్ర‌మే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించిన సాక్షి యాజ‌మాన్యం స‌ర్దుబాటులో భాగంగా చాలామంది స‌బ్ ఎడిట‌ర్ల‌కు పోస్టింగులు ఇవ్వ‌కుండా ఆపింది. ప‌లువురు రిపోర్ట‌ర్ల‌ను బ‌దిలీ పేరుతో దూరాన విసిరికొట్టింది. మొత్తంగా ఈనాడు బాట‌లో సాక్షి కూడా త‌న ప‌య‌నాన్ని మొద‌లుపెట్టింది. అందుకే ఒక‌రి ప‌త్రిక‌లో ఇంకొక‌రి దాష్టీకం మీద వార్త‌లు రావు. నాకు తెలిసి ఇప్పుడు ప‌త్రికారంగంలో రెండే విభాగాలు ఉన్నోడు (యాజ‌మాన్యం)... లేనోడు (జ‌ర్న‌లిస్టులు). కాక‌పోతే ఉన్నోళ్ల‌లోని చైత‌న్యం లేనోడిలో కొర‌వ‌డింది. అందుకే భుజాలెగిరేసే జ‌ర్న‌లిస్టులు ఇప్పుడు ఓటి మ‌ల్ల‌న్న‌లుగా బీద అరుపులు అర‌వాల్సిన దుస్థితి నెల‌కొంది.
- ప‌త్రిక ధ‌ర పెంచాల‌న్నా... ఉన్న‌ప‌లంగా వినాయ‌క చ‌వితికి సెల‌వు ప్ర‌క‌టించాల‌న్నా... చివ‌ర‌కు సండే మ్యాగ‌జైన్‌, స్పెష‌ల్ పేజీల‌ను ర‌ద్దు చేసుకోవాల‌న్నా... ఈనాడు, సాక్షి యాజ‌మాన్యాలు క‌లిసి మాట్లాడుకుంటాయి. ఒక‌వేదిక‌పై వ‌చ్చి నిర్ణ‌యం తీసుకుంటాయి. నిన్న‌టిదాకా ఒక‌రిని దుమ్మెత్తి పోయ‌డానికే ఒక‌రి ప‌త్రిక ఉన్న‌ట్లు పేజీల‌కు పేజీలు నింపినోళ్లు ఒక సంస్థ‌లో జ‌రుగుతున్న అన్యాయాన్ని క‌నీసం రెండ‌క్ష‌రాల రూపంలోనైనా చూపిస్త‌లేరు. ముఖ్యంగా ఈనాడులో ఇంత జ‌రుగుతున్నా... సాక్షి నోరు మెద‌ప‌దు. గ‌తంలో ఫిల్మ్ సిటీ ఉద్యోగుల కోసం గోనె ప్ర‌కాశ్‌రావుతో ఒక ఉద్య‌మ‌మే న‌డిపించిన సాక్షి ఇప్పుడు ఎందుకు మౌన‌వ్ర‌తం చేస్తుంది?. ఎందుకంటే ఈనాడు పాల‌సీని తానూ అమ‌లు చేయాల‌ని ముందుగానే ప్ర‌ణాళిక రూపొందించింది క‌నుక‌. త‌న మౌనంతో ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప‌లికింది. 
- మ‌రి... జ‌ర్న‌లిస్టుల్లో ఆ చైత‌న్యం ఎక్క‌డ పోయింది?. ఒకాయ‌న పెద్దాయ‌న ప‌క్క‌న చేరితే... ఇంకో ఆయ‌న హైటెక్కు బాబు సంక‌న కూర్చునె. మ‌రో ఆయ‌న ఎవ‌రి భుజం ఎక్కాలో బేరీజు వేసుకునె. కానీ సామాన్య జర్న‌లిస్టులు సంఖ్యాబ‌లం కోస‌మే ప‌రిమిత‌మాయె. జ‌ర్న‌లిస్టు నాయ‌కులు రాజ‌కీయ పార్టీల త‌క్క‌డలో పుట్ట‌కొక్క‌రు చెట్టుకొక్క‌రు అయ్యారు. ఎవ‌రెక్క‌డున్నా వాళ్లు బాగానే ఉన్నారు. కానీ సామాన్య జ‌ర్న‌లిస్టుకు ర‌క్ష‌ణేది?. ఉద్యోగ భ‌ద్ర‌తేది?. లోకానికి నీతులు చెప్పే జ‌ర్న‌లిస్టుల‌ ప‌రిస్థితి ఇంత దారుణంగా త‌యారైనా పిడికిలి బిగించ‌లేని బేళ‌తనానికి కార‌ణ‌మెవ‌రు? ఒక్క‌సారి వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టులు పెన్ను, పేప‌ర్ ప‌క్క‌న‌పెట్టి రెండు నిమిషాలు మెద‌డుకు ప‌నిచెబితే క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంది అస‌లు చిత్రం. ఇదే... జ‌ర్న‌లిస్టు నేత‌లు రాజ‌కీయ నాయ‌కుల పంచ‌న చేర‌కుండ ఉండి ఉంటే... పార్టీల వారీగా విడిపోకుండా ఉండి ఉంటే... ఈ యాజ‌మాన్యాలు ఏఒక్క‌టైనా ఇంత‌టి దారుణాల‌కు ఒడిగ‌ట్టేవా?. అందుకే జ‌ర్న‌లిస్టు సంఘాలు కాదు... జ‌ర్న‌లిస్టు నాయ‌కులు కాదు... వీటికి అతీతంగా జ‌ర్న‌లిస్టు స‌మాజం ఏకం కావాల్సిన స‌మ‌యం ఎప్పుడో ఆస‌న్న‌మైంది. కాక‌పోతే దాన్ని ఎవ‌రూ గుర్తించ‌లేదు. ఇప్ప‌టికైనా సాధార‌ణ జ‌ర్న‌లిస్టు బ‌య‌టికొచ్చి.. రాజ‌కీయాల‌కు అతీత‌మైన‌, సంప్ర‌దాయ సంఘాల‌కు అతీత‌మైన ఒక వేదిక‌ను ఏర్పాటు చేయాలి. లేక‌పోతే ఏనుగులు కొట్లాడిన ఈ నేల‌పై ఇంకెన్ని పీనుగ‌లు వీధిన‌ప‌డాల్సి వ‌స్తుందో?.

No comments:

Post a Comment