- ఉద్యోగులకు ఆంక్షలులేని ఆరోగ్య బీమా కార్డులు జారీ చేశారు. బాగానే ఉంది. ప్రభుత్వానికి కృతజ్ఙతలు. నిరుపేదకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఉన్నోళ్లు ఎలాగూ డబ్బులతో కార్పొరేట్ వైద్యం అందుకుంటాడు. జర్నలిస్టులు, ఇతరత్రా రంగాల వారు ఎలాగో ప్రభుత్వం నుంచి సంస్థల నుంచి బీమా కార్డులు పొందుతున్నారు. కానీ సామాన్య జనం పరిస్థితి ఏమిటి? అటు ఆరోగ్యశ్రీ అర్హుల కంటె కాస్త ఎక్కువ, ఉన్నోళ్లకు చాలాదూరంలో ఉన్న ఒక వర్గం సమాజంలో అత్యధికంగా ఉంది. ముఖ్యంగా 2004 తర్వాత (యాదృశ్చికమో, విధానాల ఫలితమో వైఎస్ హయాంలో) అటు పేద, ఇటు ధనిక మధ్య అంతరం విపరీతంగా పెరిగి ఈ మధ్య తరగతి వర్గం ఎక్కువైంది. మరి వీరి ఆరోగ్యం పరిస్థితి ఎలా?. ముఖ్యంగా రూ.15వేల నుంచి రూ.25వేల మధ్య ప్రైవేటు రంగంలో పని చేస్తున్న వారు కుటుంబంలో ఎవరికైనా అనారో్గ్య సమస్య వస్తే కనీసంగా రూ.20-30వేలు పెట్టాలన్నా అప్పుల పాలవుతున్నారు. ఆ వడ్డీలు కట్టలేక, ఇటు కుటుంబాన్ని పోషించలేక మధనపడుతున్నారు. అందుకే వీరిపై దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే అందరికీ ప్రభుత్వం పూర్తి సహకారం చేయడం సాధ్యం కాదు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. అవసరమైతే నిర్బంధ విద్య మాదిరిగా నిర్బంధ హెల్త్ పాలసీని రూపొందించాలి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో పేద నుంచి ధనికుడి వరకు వైద్యం కోసం ఒక్క పైసా ఖర్చు చేయరు. అంతా బీమామీదనే ఆధారపడతారు. కొన్ని చోట్ల దీన్ని మ్యాండేటరీ చేశారు. అలాగే తెలంగాణలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్‌ను మ్యాండేటరీ చేయాలి. వీలైతే ప్రభుత్వం కొంత వాటా భరించేందుకుగానీ తక్కవ మొత్తంలో అన్ని రకాల సేవలు అందించే కంపెనీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంగానీ చేయాలి. లేకపోతే ప్రభుత్వ ఆస్పత్రులను ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ చేసి అంతిమంగా ఇన్సూరెన్స్ ఉన్న వారు నయాపైసా లేకుండా లక్షల వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి. దీని ద్వారా ప్రభుత్వంపై ఆర్థికంగా భారం లేకుండానే సామాన్యుడికి ఆరోగ్య భద్రత లభిస్తుంది. అందరం ఆశించే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుంది. మిత్రులందరూ ఒక్కసారి ఆలోచించండి. ప్రధానంగా ఎన్నారైలు దీనిపై కాస్త ధ్యాస పెట్టినా మంచి ప్రాజెక్టుగా మారి, తెలంగాణలో సామాన్యుడి ఆరోగ్యానికి భద్రత లభిస్తుంది. ఆరోగ్య తెలంగాణలో దీపావళి వెలుగులు మరింత శోభను పంచుతాయి. జై తెలంగాణ, మీ అసాంజే.
No comments:
Post a Comment