టీఆరెస్ పార్టీలోకి వలసలను చూస్తున్నాం. సాధారణ ప్రజలు దీనిపై విసుక్కుంటున్నారు. ఇదేంది?... అన్ని పార్టీల నుంచి ఇలా క్యూ కడుతున్నారు. చేరేవాళ్లు అభివృద్ధి, బంగారు తెలంగాణ అంటున్నారు. బాగానే ఉంది. కానీ వాస్తవంగా వారి మనసులో అధికారం అనేది ఆయా పార్టీల్లో కుదురుగా ఉండనీయక టీఆరెస్‌లో చేరేలా చేస్తుందనేది బహిరంగ రహస్యం. అయితే టీఆరెస్ అధిష్ఠానం ఈ విషయాన్ని గుర్తించాలి. వస్తుంటె ఎలా కాదనగలం... అనేది పాత మాట. కొత్త రాష్ట్రం, ప్రజల అండతో గెలిచిన పార్టీ వినూత్నంగా అడుగులు ఉండాలి. కానీ గతంలో ఇతర సంప్రదాయ పార్టీలు చేసినట్లు వరుసగా వచ్చే వారిని చేర్చుకొని ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నాం? అనేది మాత్రం ఒకసారి అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలో చేరికలు అనేది ఆ పార్టీ సొంత అంశం. కానీ టీఆరెస్‌ను జనం అలా చూడలేదు. కేసీఆర్ మాది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించవచ్చు. కానీ జనం మొన్నటి ఎన్నికల్లో నిలబడిన నాయకులు, వారి ఆర్థిక పరిపుష్టి, అహర్యం చూసి ఓటేయలేదు. మొక్కవోని దీక్షతో 14 ఏండ్లు కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ కోసం నిలబడ్డాడు, విజన్ ఉంది, ఆంధ్ర కుట్రలను ఎదుర్కొనే మొండితనం ఉంది అనే అర్హతలను చూసి... అభ్యర్థులతో నిమిత్తం లేకుండా ఓటేశారు. నాలాంటి వారు ఆనందించేలా అటు ఎక్కువ కాకుండా, ఇటు తిరిగి టీఆరెస్‌ను ఇబ్బందిలోకి నెట్టేవిధంగా కాకుండా 63 సీట్లు వచ్చాయి. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే మెజార్టీ ఆశించడం, అవసరం అనుకోవడం కూడా అత్యాశ అవుతుందేమో. కేసీఆర్ ఈ ఐదేండ్ల పాలన తర్వాత 63 కంటే ఎక్కువ సీట్లు రావాలని లక్ష్యంగా ఎంచుకోవడం ఒక పటిష్ట నాయకుడి లక్షణం. కానీ ఇతరులకు ఇప్పట్లో ఎన్నికలు లేవని చెబుతూ... మరోవైపు ఇలా చేయడం ద్వంద్వ వైఖరి అవుతుంది. వరుస చేరికలతో వచ్చే లాభం, అవి లేకుంటే కలిగే నష్టం ఏమిటో సాధారణ జనానికి మాత్రం అర్థం కావడం లేదు. మళ్లోసారి చెబుతున్నా... చేరికలు ఆయా పార్టీల వ్యక్తిగత విషయం కావచ్చు. కానీ టీఆరెస్ సాంకేతికంగా రాజకీయ పార్టీ కావచ్చుగానీ అధికారంలోకి రావడానికి ఆ రాజకీయానికి అతీతంగా మరెన్నో నమ్మకాలు, ఆశలు, ఆకాంక్షలు ఆశీర్వదించాయనే విషయాన్ని మాత్రం టీఆరెస్ పెద్దలు గుర్తించాలి.
No comments:
Post a Comment