1

1

Saturday 29 November 2014

అది... ప్రెస్ కౌన్సిల్ ఆఫ్‌ ఆంధ్ర‌

దేశ స్థాయిలో ఉండే ప్ర‌భుత్వాలు, సంస్థ‌ల‌కు అన్ని రాష్ట్రాలూ స‌మాన‌మే. కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మాత్రం ఆంధ్ర‌కు ముల్లు గుచ్చుకున్నా అది ప్ర‌పంచ బాధ‌గా మారింది. అదే తెలంగాణ‌కు భారీ గాయ‌మైనా ఏమాత్రం ప‌ట్టింపు లేకుండా ఉంది. మ‌రి ఆ కుర్చీలో కూర్చున్న వారు గ‌తంలో పెద్ద పెద్ద స్టేట్‌మెంట్ల‌తో మాన‌వ‌తావాదులుగా, మేధావులుగా కీర్తించ‌బ‌డ్డారు. కానీ మిత్రులారా... ఈ ఒక్క ఉదాహ‌ర‌ణ చూడండి. ఆత‌ర్వాత వారినేమంటో మీరే నిర్ణ‌యించండి. అంతేకాదు.... అస‌లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానా అది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర‌నా నిర్ణ‌యించండి.
రాష్ట్ర విభ‌జ‌న‌తో తెలంగాణ‌, సీమాంధ్ర మీడియా ఏదో పానీకా పానీ... దూద్‌కా దూద్ అన్న‌ట్లు తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల్లో కొన్ని మీడియా సంస్థ‌లు బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి. ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌లు ఒక్కొక్క‌రి తమ కోణంలో ఒక‌టి మంచిది అనిపించ‌వ‌చ్చు. కానీ దేశ‌స్థాయిలో వెల‌గ‌బెడుతున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రెండు రాష్ట్రాలు, అన్ని మీడియా సంస్థ‌లు స‌మాన‌మే. అయినా పీసీఐ దానిని ఆచ‌ర‌ణ‌లో చూప‌కుండా ఫ‌క్తు ఆంధ్ర కౌన్సిల్‌గా వ్య‌వ‌హ‌రించింది. వాస్త‌వంగా తెలంగాణ‌లో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి, టీవీ9 నిషేధంపై పీసీఐ సెప్టెంబ‌రు 12న త్రిస‌భ్య క‌మిటీని వేసింది. అదేవిధంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు అధికారిక స‌మావేశాల‌కు న‌మ‌స్తే తెలంగాణ‌ను బ‌హిష్క‌రిస్తున్నార‌నే ఫిర్యాదుపై సెపె్టంబ‌రు 26న త్రిస‌భ్య క‌మిటీ వేశారు. మొద‌టి క‌మిటీలో తెలంగాణ వారెవ‌రూ లేరు. కానీ రెండో క‌మిటీలో ఆంధ్రకు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు స‌భ్యుడు. స‌రే... అది ప‌క్క‌న‌పెడితే మొద‌టి క‌మిటీ రోజుల వ్య‌వ‌ధిలోనే విచార‌ణ ముగించి... కేంద్ర స‌మాచార‌, బ్రాడ్‌కాస్టింగ్‌కు నివేదిక ఇచ్చింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో మీడియాకు పెద్ద ఎత్తున ముప్పు ఉందంటూ వాపోయింది. కానీ రెండో క‌మిటీ విచార‌ణ ముగించి దాదాపు రెండు నెల‌లు కావ‌స్తుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు నివేదిక ఇవ్వ‌లేదు. తెలంగాణ‌కు చెందిన ఒక యువ ఐఐటీ ప్రొఫెస‌ర్ ఈ గుట్టును స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ర‌ట్టు చేశారు. రెండు ఫిర్యాదుల‌పై వేసిన క‌మిటీల నివేదిక‌లేంటో చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి ఆన్‌లైన్‌లో స‌హ చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆంధ్ర మీడియా ఆవేద‌న‌పై నివేదిక వ‌చ్చిందంటూ కేంద్ర స‌మాచార‌, బ్రాడ్‌కాస్టింగ్ ఆదేశంతో స‌మాధాన‌మిచ్చిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న‌మ‌స్తే తెలంగాణ అంటే ఆంధ్ర స‌ర్కారు వైఖ‌రిపై మాత్రం ఇంకా విచార‌ణ నివేదిక అంద‌లేద‌ని స‌మాధాన‌మిచ్చింది. మ‌రి ఆంధ్రకైతే 20 రోజుల్లోపు వ‌చ్చిన నివేదిక‌... తెలంగాణ విష‌యంలో ఎందుకు రాలేదో కుర్చీల్లో హోదాలు వెల‌గ‌బెడుతున్న వారు విచారించాలి క‌దా... అంటే ఆంధ్ర బాధ లోకం బాధ‌... తెలంగాణ గోడు ఎవ‌రికీ ప‌ట్ట‌దా? ఇది తెలంగాణ ప్ర‌జ‌ల‌కే కాదు... వేడుక‌లు, కార్య‌క్ర‌మాల్లో బ్యాన‌ర్ల‌పై తెలంగాణ జ‌ర్న‌లిస్టు సంఘాల నేత‌ల‌మ‌ని చెప్పుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌మానం. మ‌రి వారు ఒక్క‌సారి త‌మ‌ను తాము ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటే బాగుంటుందేమో?!

No comments:

Post a Comment