1

1

Wednesday 25 June 2014

ఈ ఏడుపుగొట్టు ఐడియాలేంటో..!


గ‌త కొన్నిరోజులుగా ఖాళీ స‌మ‌యం దొర‌క‌డంతో మా టీవీలో మీలో ఎవ‌రు ల‌క్షాధికారి ప్రోగ్రాంను ఫాలో అయ్యాను. మొద‌టిసారిగా అక్కినేని నాగార్జున నిర్వ‌హిస్తున్న ఇది బాగుంది. ముఖ్యంగా జీకే పెంచేదిగా ఉంది. కానీ ఇలాంటి కార్య‌క్ర‌మంలోనూ సాధార‌ణంగా తెలుగు టీవీ ఛానెళ్లు రేటింగ్ పెంచుకునేందుకు చేసే దిక్కుమాలిన పంథా ఒక‌టి పాటిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో చూశాం... ఓంకార్ అనే వ్య‌క్తి త‌న ప్రోగ్రాంల ద్వారా రేటింగ్ పెంచుకుని, తాను డ‌బ్బులు సంపాదించుకునేందుకు పార్టిసిపెంట్ మ‌ధ్య గొడ‌వ పెట్ట‌డం, వారితో ఏడ్పించ‌డం ఇలా జుగుప్సాక‌ర‌మైన విధానాలు పాటించేవారు. మరి ఈ ల‌క్షాధికారి ప్రోగ్రాంలో అంతా బాగుంది. కానీ నాగార్జున హాట్ సీట్‌పై వ‌చ్చిన ప్ర‌తి వ్య‌క్తిని ఒక ప్ర‌శ్న వేస్తున్నారు. *మీ జీవితంలో అత్యంత విషాద‌క‌ర‌మైన (బ్యాడ్ మూమెంట్‌) ఏమిటి* అని అడుగుతున్నారు. చాలామంది త‌మ త‌ల్లిదండ్రులు చ‌నిపోయిన విష‌యాన్ని, వైనాన్ని వివ‌రిస్తూ క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. నాగార్జున అయ్యో.. అన‌డం కొంత‌సేపు ఒక‌ర‌క‌మైన మ్యూజిక్‌!. నిన్న‌టికి నిన్న సుజాతా రాణి అనే న‌ల్లొండ మ‌హిళ త‌న తండ్రి ఆత్మ‌హ‌త్య‌పై మాట‌లు రాక చెప్ప‌లేక‌పోయింది. నాగార్జున ఇష్టం లేకుంటే చెప్పొద్దు అంటూనే దానిని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆమె క‌న్నీళ్ల‌ను నియంత్ర‌ణ చేసుకోలేక లేట‌ర్ అంది. అంటే ఆమెకు చెప్ప‌డం ఇష్టం లేద‌ని సులువుగా తెలుస్తుంది. అలాంట‌ప్పుడు ఆ విష‌యాన్ని వ‌దిలివేయ‌వ‌చ్చు క‌దా... ఒక ప్ర‌శ్న త‌ర్వాత మ‌ళ్లీ త‌ర్వాత చెబుతాన‌న్నారు క‌దా... మీ నాన్న‌గారు ఎలా చ‌నిపోయారు?. అంటూ తెలివిగా ఆమెతో చెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. చెప్పేదాకా వ‌ద‌ల్లేదు. ఇదేంది?. వాళ్లు ఏడిస్తే రేటింగ్ ఇంకా పెరుగుతుందా?.. క‌న్నీళ్ల‌తోనే కార్య‌క్ర‌మాలు ర‌క్తి క‌డ‌తాయ‌నే పొరంబోకు ఐడియా ఎవ‌రిచ్చారోగానీ ఇది చాలా బాధాక‌రం. ఏం... పార్టిసిపెంట్‌ను మీ జీవితంలో అత్యంత హ్యాపీడే ఏంటి? అని అడ‌గ‌వ‌చ్చు క‌దా. నెగెటివ్‌గానే ఎందుకు ప్ర‌శ్నించాలి. స్ఫూర్తివంత‌మైన విష‌యాలు ఏమైనా చేశారా?.. అని ప్ర‌శ్నించ‌వ‌చ్చు క‌దా. ఒక‌రిని ఏడిపించ‌డం ద్వారా చూసే వారి సంఖ్య పెరుగుతుంది... ఎవ‌రూ ఛానెల్ మార్చ‌రు అనే భ్ర‌మ‌ల నుంచి నిర్వాహ‌కులు ఇప్ప‌టికైనా బ‌య‌టికి రావాలి.

No comments:

Post a Comment