1

1

Wednesday, 25 June 2014

బాబుగారు మాట నిలుపుకోవాలి..

ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటాన‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నారు. నిజ‌మే ఆయ‌న క‌చ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆయ‌న మారిన మ‌నిషి. కానీ కొన్ని ప‌త్రిక‌లు అన‌వ‌స‌రంగా లీకులు ఇచ్చి రైతాంగాన్ని అయోమ‌యానికి గురి చేస్తున్నాయి. మ్యానిఫెస్టోలో అక్ష‌రాలా పేర్కొన్న‌ట్లు అన్ని ర‌కాల‌, రైతుల మొత్తం రుణాన్ని మాఫీ అమలు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుగారిపై, అలా కాప‌లాకాయాల్సిన బాధ్య‌త ప‌త్రిక‌ల‌పై ఉంది. కానీ ఓ రెండు ప‌త్రిక‌లు ఇందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ రిస్తున్నాయి. లీకుల పేరిట‌... ల‌క్ష రూపాయ‌లు, ల‌క్ష‌న్న‌ర‌, ఇలా ష‌ర‌తులతో్ రుణ మాఫీ అమ‌లుకు రంగం సిద్ధం అవుతుంద‌ని క‌థ‌నాలు ఇస్తున్నాయి. నిన్న‌టిదాకా తెలంగాణ రాష్ట్రంలో రుణ మాఫీపై ఓ మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై దీర్ఘాలు తీసిన మీడియా ఇప్పుడు రైతుల‌కు వ్య‌తిరేకంగా ష‌ర‌తుల‌తో కూడిన మాఫీపై గ‌ళం విప్ప‌కుండా... అదేదో వ‌రం అన్న‌ట్లుగా రాస్తున్నాయి. ష‌ర‌తుల‌పై అవి ఎందుకు నోరు మెద‌ప‌డం లేదు?. ల‌క్ష‌, ల‌క్ష‌న్న‌ర అంటూ కోత‌లు పెట్ట‌డ‌మేంటి?. అందునా బంగారు రుణాల‌పై మహిళ‌ల పేరిట ఉన్న రుణాలు మాత్ర‌మే మాఫీ చేస్తార‌ట‌. ఇదెక్క‌డి న్యాయం?. భూమి పాసు పుస్త‌కాలు ఎవ‌రి పేరుమీద ఉంటే రుణం వారి పేరు మీద ఇస్తారు. మ‌న దేశంలో త‌ర‌త‌రాలుగా వార‌స‌త్వంగా వ‌చ్చే భూముల‌ను ఆ ఇంటి కొడుకుల పేరిట ప‌ట్టా చేస్తారు. కానీ కోడ‌లు పేరు మీద ఎవ‌రూ చేయ‌రు. మ‌రి ఇలాంట‌ప్పుడు ఆ నిరుపేద రైతు కుటుంబాల్లో ఉన్న నాలుగైదు ఎక‌రాల పొలం కోసం బంగారం తాక‌ట్టు పెడితే ఇంటి పెద్ద పేరు మీద ఉన్న భూమిపైనే పెడ‌తారు. మ‌హిళ పేరు మీద భూమి ఎలా ఉంటుంది?. క‌ట్నంగా భూములు ఇచ్చే సంప్ర‌దాయం ఉన్నా... ఆ కేసులు చాలా అరుదు. ఇవ‌న్నీ రెండెక‌రాల ఆస్తి ఉన్న కుటుంబంలో పుట్టిన చంద్ర‌బాబు తెలియ‌నిది కాదు. ఇంత తెలిసిన వ్య‌క్తి ఇలా పిత‌లాట‌కం పెట్ట‌డం, రైతుల ఆశ‌ల‌పై ఈ వ‌ర్షాభావ ప‌రిస్థితుల్లోనూ నీళ్లు చ‌ల్ల‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం?
బాబు గారూ... రైతు క్షేమంగా ఉంటేనే ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అన్న‌పూర్ణ‌గా పేరు తెచ్చుకున్న ప్రాంతంలో అన్న‌దాత‌లు క్రాప్ హాలిడేను ప్ర‌క‌టించి, ప్ర‌పంచంలోనే ఓ వినూత్న త‌ర‌హాలో త‌మ నిస్ప‌హాయ‌త‌ను వ్య‌క్తం చేసిన చ‌రిత్ర ఉంది. ఆ స‌మ‌యంలో రైతుల ప‌క్షాన ఢిల్లీదాకా గ‌ట్టిగా వాదించిన మీరు ఇలా పిత‌లాట‌కాల‌తో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైత‌న్న‌ను స‌గం అప్పులు తీర్చి... న‌డివీధిలో ప‌డేయ‌డం ఎంత‌వ‌ర‌కు ప‌ద్ధ‌తి. ప్ర‌పంచానికే సాంకేతిక పాఠాలు నేర్పిన మీరు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌దు. అందునా ఓ నిర్ణ‌యం తీసుకున్నా... మ్యానిఫెస్టో త‌యారు చేసినా అంత ఆషామాషీగా మీరు చేయ‌రు. చాలా క‌స‌ర‌త్తు, మేథో మ‌థ‌నం చేస్తారు. ఓ రెండు ప‌త్రిక‌ల ద్వారా ఈ విష‌యం మా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా తెలిసింది. అందుకే మీరు మ్యానిఫెస్టోలో పెట్టిన‌ట్లు అక్ష‌రాలా అమ‌లు చేయాల్సిన నైతిక బాధ్య‌త మీపై ఉంది. ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో చూశాను... ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు మాఫీ చేస్తే 96 శాతం మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ట‌. మీరు నూరు శాతం రైతుల‌కు మేలు చేస్తాన‌న్నారు. మ‌రి ఆ నాలుగు శాతం (చాలా త‌క్కువ‌) రైతులు ఏం పాపం చేశారు చెప్పండి. అందుకే మీరు విశాల హృద‌యంతో నూరు శాతం మంది రైతుల‌కు లబ్ధి చేకూరేలా రుణ మాఫీని అమ‌లు చేయాల‌ని అన్న‌దాత‌ల త‌ర‌పున మేం కోరుతున్నాం. ఎందుకంటే రైత‌న్న విష‌యంలో ప్రాంతాలు, కులాలు, మ‌తాలు చూసుకోవ‌డం స‌రికాదు. అన్న‌దాత ఎక్క‌డ ఉన్నా ప‌ది మందికి అన్నం పెట్టేవాడే. అందుకే ఎంత భార‌మైనా మీరు రుణ మాఫీ చేస్తే చ‌రిత్ర‌లో మీ పేరు నిలిచిపోతుంది. అంతేకాదు వ్య‌వ‌సాయం దండ‌గ అన్న మీరు కాదు పండ‌గ చేసేందుకే వంద శాతం రుణ మాఫీ చేశాన‌ని నిరూపించుకోవాలి. విమ‌ర్శ‌కుల నోర్లు మూయించాలి. రైతు వ్య‌తిరేకి అన్న మీ ప్ర‌త్య‌ర్థుల మాట‌ల‌ను అక్షారాలా త‌ప్పు అని రుజువు చేయాలి. అలా మీరు చేస్తారు... చేయ‌గ‌ల‌రు. మీకు వంత పాడే ప‌త్రిక‌లు కోత‌ల‌తో ఎలా అమ‌లు చేయాలో అని లేనిపోని త‌ప్పుడు స‌ల‌హాలు ఇచ్చి, మిమ్మ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తాయి. వాటిని కాద‌ని మీరు ముందుకు వెళ్లాలి.

No comments:

Post a Comment