ఈ నెలలో రెండు వీడియోలు నన్ను అత్యంత కలచివేశాయి..
ఈ దేశ భక్తుల మనో ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్..!!
*********
ఎండలో గంట సేపు ఉండలేం. చలికాలం అసలు భరించలేం. అలాంటిది మంచు కింద ఆరు రోజులు కూరుకుపోయినా సరే ప్రాణాలతో కనిపించిన దివంగత లాన్స్ నాయక్ హనుమంతప్ప వీడియో కన్నీళ్లు తెప్పించింది. ఈ వీడియో ఎందరిలోనో దేశ భక్తిని ప్రేరేపించింది. కుల మతాలకతీతంగా అందరం ప్రార్థించినా, వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినా సరే దురదృష్టవశాత్తూ ఆయనను మనం బతికించుకోలేకపోయాం.. కానీ విపత్కర పరిస్థితుల్లోనూ మనో ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలన్న సందేశాన్ని ఇచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు వీర సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప.. ఆ వీరుడికి జోహారు..!!
****
చిన్న ముల్లు గుచ్చుకుంటే తట్టుకోలేం. కాలికి దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాం. కానీ శరీరం ఛిద్రమైనా, మృత్యువు కళ్ల ముందు కనిపిస్తున్నా సరే.. మనో నిబ్బరం ప్రదర్శించి ఛిద్రమైన తన శరీరంలో పనికొచ్చే అవయవాలను దానం చేయాలనే సంకల్పన్ని చాటిన హరీశ్ నంజప్ప వీడియో చూసి ఏడవకుండా ఉండలేకపోయాను. ఆ యువకుడిలోని సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత చూస్తుంటే దేశం మరో బాధ్యతాయుతమైన పౌరుడిని కోల్పోయిందన్న భావన కలిగింది.
హరీశ్ కుటుంబ పరిస్థితి గురించి ఇంటర్నెట్ లో చదివితే.. ఎనిమిదో ఏటనే తండ్రిని కోల్పోయాడు హరీశ్ నంజప్ప. చిన్న తనం నుంచి తమ కోసం తల్లి కష్టపడటం చూడలేక బెంగళూరులో లాజిస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కుటుంబ బాధ్యతను మోస్తున్నాడట. ఇక ఆయన స్వగ్రామానికి వెళ్లింది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయడానికి. ఉన్నత కొలువులు చేస్తూ, సంపన్న కుటుంబాల్లో పుట్టిన కొందరు ఓట్ల పండగ రోజు సెలవు దొరికితే సినిమాలకు పోతున్న రోజులివి. కానీ వారందరికీ భిన్నంగా హరీశ్ నంజప్ప ఓటేసి వస్తూ ప్రమాదానికి గురి కావడం, శరీరం ఛిద్రమైనా సరే నా వాళ్లకు సమాచారం ఇవ్వమని అడగకుండా, నా అవయవాలను దానం చేయమని పదేపదే కోరడం ఆయనలోని సేవా గుణానికి నిలువెత్తు నిదర్శనం. సమాజంలో బాధ్యతాయువతంగా మెలగడం ఎలాగో అతడిని చూసి నేర్చుకోవచ్చు.
తన కళ్లతో ఓ అంధుడికి చూపు ప్రసాదిస్తున్న హరీశ్ నంజప్ప ఈ సమాజాన్ని నిరంతరం చూస్తూనే ఉంటాడు. మనతో జీవిస్తూ ఉంటారు.
అవయవ దానంతో అమరుడైన హరీశ్ నంజప్ప హ్యాట్సాఫ్..
***********
నోట్ : విచిత్రం ఏంటో గాని ఈ ఇద్దరు యువకులూ కర్ణాటకకు చెందిన వారు కావడం విశేషం. ఇక వీరి పేర్లు హెచ్ తో మొదలు కావడం గమనార్హం.
No comments:
Post a Comment