రాజకీయాలు ఎలా ఉన్నా... నేతలు ఏం తిట్టుకున్నా... డొక్క ఎండిన రైతన్న బాగుపడాలంటే ఈ బ్లూ ప్రింట్ సాకారం కావాల్సిందే. ఇదేదో రాత్రికి రాత్రి జరిగేది కాదు. 2-3 ఏళ్లలో పూర్తవుతుంది అనుకున్నా అది అత్యాశే. ఈ టర్మ్ కాదు.. 10 సంవత్సరాలకు ఇది సంపూర్ణమైనా అది అద్భుతమే. అద్భుతమనేది సాధారణ అంచనాలకు అతీతంగా ఉంటుంది. కాకపోతే అప్పటివరకు అడుగులు ** సరిగా ** పడుతున్నాయా లేదా అనేది మాత్రమే ప్రధానం. అనుమానాలు... ఆరోపణలు... విమర్శలు... కోట్లల్లో ఉండొచ్చు. కానీ అడుగులు ముందుకు పడనిద్దాం. అదే కోవలో తెలంగాణ సాగునీటి రంగంలో అద్భుతాలు జరిగితే భావి తరాలకు అది శ్రీరామరక్ష. నవ్వే వాళ్ల ముందు జారిపడొద్దంటే *** చేస్తామంటున్న, చేస్తున్న*** వాళ్ల కాళ్లు పట్టి గుంజడం బంజేయాలి. అది మేధావులు, మీడియా, రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు. అంతిమంగా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి అంశాల్లో పంచాయితీలు మానుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో బయటికి ఎంత రాజకీయ రచ్చ జరిగినా పట్టిసీమ విషయంలో అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాయి. అందుకే అక్కడి ప్రభుత్వం దానిని వెంటనే పూర్తి చేయగలుగుతుంది. తెలంగాణలో కూడా రాజకీయ కొట్లాటలు ఎలా ఉన్నా... సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అందరూ ఏకతాటిపై ఉండాల్సిందే. ఇది తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీలకు జారీ చేస్తున్న ఫత్వా అనుకోండి, జడ్జిమెంట్ అనుకోండి!. ఇంకేదైనా అనుకోండి. అన్నం పెట్టే రైతన్న చల్లగుండాలంటే ఈ రాజీ తప్పదు మరి.
No comments:
Post a Comment