తెలంగాణ అంబాసిడర్‌గా సానియా మీర్జాను నియమించడంపై బీజేపీ నాయకుల స్పందన విచిత్రంగా ఉంది. సాధారణంగా ఈ కాషాయవాదులు ఆమె పాకిస్తాన్ కోడలు అయినందున ఆ కోణంలో వ్యతిరేకత వ్యక్తం చేయాలి. కానీ వీరి ధోరణి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సానియాను నియమించడంపై ఎలాంటి అభ్యంతరం లేదట!. కానీ ఆమెను కేసీఆర్ హైదరాబాదీ అనడంపై వారు దృష్టిసారించారు. ఇదేదో హైదరాబాద్ మీద ప్రేమతో కాదు... ఈ సందున సీమాంధ్రకు తెలంగాణ సంపదను దోచిపెట్టాలని చూస్తున్నారు. సానియాను హైదరాబాదీ అన్నందున సీమాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని కూడా హైదరాబాదీలుగానే పరిగణించాలట. వారికి తెలంగాణ ప్రభుత్వం ఫీజులు చెల్లించాలట. ఇదేదో సీమాంధ్ర బీజేపీ నాయకులు డిమాండు చేసినా ఓ అర్థంపర్థం ఉండేది. కానీ తెలంగాణకు చెందిన నాయకులే పత్రికలు, చానెళ్లకు ఎక్కి... సీమాంధ్ర విద్యార్థులకు ఫీజులు చెల్లించాలంటూ డిమాండు చేస్తున్నారు. నిజంగా వీరికి ఏమైనా తెలంగాణ సోయి ఉందా?. ఏపీ సర్కారు పీపీఏలు రద్దు చేసినపుడు వీళ్లు మీడియాకు ఎక్కి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారా?. కానీ ఇప్పుడు మాత్రం సీమాంధ్ర విద్యార్థులకు తెలంగాణ సొమ్ము దోచిపెట్టేందుకు పోటీపడుతున్నారు. వాస్తవంగా ఈ కాషాయవాదులు సానియా మీర్జా ఎంపికపై పాకిస్తాన్ కోణంలో విమర్శలు చేస్తే వీరి నిజాయితీ బయటపడేది. బీజేపీ సిద్ధాంతానికి అనుగుణంగా వీరు వ్యవహరిస్తున్నట్లు అర్థమయ్యేది. కానీ సీమాంధ్ర కోసం వారి సిద్ధాంతాన్ని పక్కనపెట్టి సానియా అంశాన్ని సాకుగా చూపి తెలంగాణేతర విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే వీరు కాషాయవాదులా?. సీమాంధ్రవాదులా?. అనే అనుమానం కలుగుతుంది.
No comments:
Post a Comment