సాగర్ ఎండినంక జీరో ప్రవాహం గుర్తుకొచ్చిందా?.
కేసీఆర్ గారూ... కుట్రలపై మేల్కొనండి!
పచ్చ పార్టీ పాంప్లెంట్‌కు ఇప్పుడు తెలివొచ్చింది. డ్రామోజీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు చీకటి సమావేశంతో నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకుపోయే కుట్రను విజయవంతంగా కేంద్రంతో అమలు చేయించారు. ఉన్నవే 513 టీఎంసీల నీళ్లయితే అందులో ఏకంగా 16 టీఎంసీలు తోడేందుకు పక్కా కుట్రను అమలు చేశారు. ఆ సమయంలో ఏమాత్రం కిమ్మనని ఈనాడు... ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెర లేపింది. వాస్తవంగా సామాజిక స్పృహ, బాధ్యత ఉన్న పత్రికయితే కృష్ణాజలాలపై తెలంగాణ, ఎంపీల మధ్య వివాదం మొదలుకాగానే జీరో ప్రవాహంపై కథనం ఇవ్వాలి. నిన్నటిదాకా కలిసున్నోళ్లు ఇప్పుడు కొట్టాడటానికి కారణం వర్షాభావం అంటూ ఎగువ ప్రాంతం నుంచి చుక్క ఇన్‌ఫ్లో లేదని రాయాలి. అందుకు బలమైన గత సంవత్సరాల వివరాలు, అంకెలూ ఉన్నాయి. కానీ ఈనాడు ఆ ఆలోచనను కుట్రపూరితంగా విస్మరించింది. ఎంతసేపు రెండు రాష్ట్రముల మధ్య వివాదం నెలకొందంటూ పబ్బం గడిపింది. ఇక కృష్ణా డెల్టాకు నీళ్లొదిలారు. ఇక పనైపోయింది. అంతే... ఈనాడుకు వెంటనే వర్షాభావం గుర్తొచ్చింది. అసలు ఆల్‌మట్టిలోకి వరద రాలేదనే విషయం ఇప్పుడు కొత్తగా వారి సో్యిలోకి వచ్చింది. ఎక్కడ తెలంగాణ వాళ్లు శ్రీశైలం నుంచి నీళ్లొదలాలని డిమాండు చేస్తారనో్... లేదా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టులను రూపకల్పన చేస్తే నీటి లభ్యత సరిగాలేనపుడు కొత్త ప్రాజెక్టులు ఎందుకని కేంద్రం నుంచి అభ్యంతరాలు లేవనెత్తేందుకు పక్కా ప్లాన్‌తో కథనాన్ని వండి వార్చింది. నిజంగా వర్షాభావం తలెత్తిందని 20-25 రోజుల కిందటే లో్కమంతా తెలుసు. కానీ అప్పుడు ఇలాంటి కథనం ఇస్తే కృష్ణా డెల్టాకు నీటి విడుదలకు అంతరాయం కలుగుతుందని ఈనాడు ఉద్దేశపూర్వకంగా మౌనం వహించింది.
రెండో పేజీలో నాగార్జునసాగర్ దుస్థితి అంటూ మరో కథనం ఇచ్చింది. ఏకంగా 21 లక్షలకు పైగా ఎకరాలు దీనిపై ఆధారపడి ఉన్నాయని, సాగు కష్టంగా ఉందని మొసలి కన్నీరు కార్చింది. మరి గత 20-25 రోజులకు, ఇప్పటికి సాగర్‌లో తేడా ఏముంది?. అప్పుడు జలకళ ఉట్టిపడిందా?. సాగర్ దుస్థితి ఇలా ఉన్నందున 513 టీఎంసీల్లో 16 టీఎంసీలు ఎలా విడుదల చేస్తారు అని రాయవచ్చు కదా... రాయదు. డెల్టాకు కడుపు నిండే దాకా వాస్తవాలను కప్పి పెట్టింది. ఇక తెలంగాణ వాళ్లు ఎక్కడ నీళ్లు విడుదలచేసుకుంటారోనని ఆసూయతో అయ్యో... సాగర్ పరిస్థితి ఇలా తయారైందంటూ ఆవేదన చెందుతున్నట్లు నటిస్తుంది. మరికొన్ని రోజులు పోగానే మరో కథనం వస్తుంది. ఎలాగూ నారుమళ్లకు నీళ్లు వదిలినందున డెల్టా రైతాంగం అధికారుల మాటలను పెడచెవిన పెట్టి పంట వేసుకున్నారని, ఇలాంటి సమయంలో వారిని ఎలా వదిలేస్తాం... సాగర్‌లో 480 అడుగుల నీళ్లు ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండనందున డెల్టాకు నీళ్లు వదలొచ్చంటూ కథనాలు సిద్ధం చేసుకుంటది.
అంతేకాదు... ఈరోజే ఈనాడులో మరో కట్టుకథతో తెలంగాణను ఎండబెట్టేందుకు మరో కుట్ర కథనాన్ని ఇచ్చింది. ఉభయతారకంగా జల వాదనలు అంటూ సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ డిమాండ్లతో కూడిన వాదనలను ట్రైబ్యునళ్ల ముందు ఉంచారట. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసే డిమాండ్లలో కొత్తవేవీ లేదని చెప్పుకొచ్చింది. ఆంధ్ర అధికారులు ఏపీ సర్కారుకు నివేదిక ఇచ్చారంటూ తన చేతికి మట్టి అంటకుండా ఉండే ప్రయత్నం చేసింది. కానీ దీని వెనక భారీ కుట్ర దాగి ఉంది. ట్రైబ్యునళ్ల ముందు తెలంగాణ సర్కారు మన కోణంలో జల వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుంది. దానిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం, ఈనాడు కలిసి ఇలాంటి కథనాలు అల్లుకొస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపి, ఇకపై ట్రైబ్యునళ్ల ముందు తెలంగాణ ప్రభుత్వం నుంచి డిమాండ్లు వినాల్సిన పనేమీ లేదని, అవి పాత చింతకాయ పచ్చళ్లు అని నమ్మించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అందుకే వీళ్ల కుట్రలను సమర్ధంగా తిప్పి కొట్టేందుకు ఇంజినీర్లు, తెలంగాణ ప్రభుత్వం సిద్ధం కావాలి. అదే సమయంలో ఈనాడు కుట్రలను భగ్నం చేసేందుకు సైతం చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే వీళ్ల చీకటి ఒప్పందాలు తెలంగాణ గొంతుకు ఉరి తాళ్లుగా మారతాయి. వీళ్ల కట్టు కథలకు ఆందోళన చెంది మన యువత ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసిన విషాద అనుభవాలు మనకున్నాయి. అందుకే తక్షణమే మేల్కొనాలి.
No comments:
Post a Comment