1

1

Friday, 25 July 2014

కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించాలి?.

ప్ర‌తి రాజ‌కీయ పార్టీకి మ్యానిఫెస్టో భ‌గ‌వ‌ద్గీత‌లాంటిది. తూ.చ‌. త‌ప్ప‌కుండా దానిని అమ‌లు చేయాల్సిందే. అందుకే అందులో అంశాలు పొందుప‌రిచేపుడు ఒక‌టికి రెండుసార్లు పార్టీలు ఆలోచించుకోవాలి. ఇదేరీతిన టీడీపీ ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో విడుద‌ల చేసిన మ్యానిఫెస్టోలోని హామీల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించి, వివ‌ర‌ణ కోరింది. అన్నీ చూసుకొని, అమ‌లు చేసేవే తాము ప్ర‌క‌టిస్తున్న‌ట్లు అందుకు టీడీపీ లేఖ రూపంలో బ‌దులిచ్చింది. కేవ‌లం రుణ మాఫీ హామీ కార‌ణంగానే అధికారంలోకి వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు అమ‌లు ఏమైంది?. అన్నీ తూట్లే!. ఒక‌టి కాదురెండు కాదు... ల‌క్ష‌న్న‌ర మొత్తం మొద‌లు మార్చి, 2014 వ‌ర‌కు అని, చివ‌ర‌కు పొదుపు సంఘాల రుణాల‌ను కూడా కుటుంబానికి ముడిపెట్టి కుటుంబానికి ఒక‌టి అనే అనేక ష‌ర‌తులు పెట్టాడు. నిజంగా ఇదేరీతిన మ్యానిఫెస్టోలో పేర్కొని అధికారంలోకి వ‌స్తే ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ బేష‌ర‌తుగా అంటూ జ‌నాన్ని ఏమార్చి అధికారంలోకి వ‌చ్చాడు. ఇప్పుడు ష‌ర‌తులు పెట్టాడు. అందుకే కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించాలి. ఎందుకంటే కేవ‌లం ఆ ఒక్క హామీ ద్వారానే టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. వైఎస్సార్సీపీ అధికారాన్ని కోల్పోయింది. ఇలా ముందుగానే ష‌ర‌తులు పెట్టి ఉంటే టీడీపీకి సీట్లు త‌గ్గేవేమో?. ఎందుకంటే అక్క‌డ కేవ‌లం రెండు పార్టీల‌కే (టీడీపీ-బీజేపీ కూట‌మి) సీట్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీకి త‌గ్గే సీట్లు వైఎస్సార్సీపీకి ద‌క్కేవి. ఫ‌లితాలు తారుమార‌య్యేవి. అందుకే ఆ కీల‌క‌మైన హామీని సంపూర్ణంగా అమ‌లు చేయ‌క‌పోవ‌డ‌మంటే ఎన్నిక‌ల‌ను ప‌రిహాసం చేయ‌డ‌మే. అందుకే కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిపై విచార‌ణ జ‌ర‌పాలి. సంపూర్ణంగా హామీని అమ‌లు చేయ‌క‌పోతే చ‌ర్య‌లు తీసుకోవాలి.
టీడీపీ ప్ర‌భుత్వ తీరుపై వైఎస్సార్సీపీ నిర‌స‌న‌లో కూడా స్ప‌ష్ట‌త కొర‌వ‌డింది. ఒకో కుటుంబం అంటే ఎలా ప‌రిగ‌ణిస్తారు?. ల‌క్ష‌న్న‌ర అంటే పంట రుణాలా?. బంగారు రుణాలా?. అని ఆ పార్టీ నాయ‌కులు అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తున్నారు. ఈ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారంటే టీడీపీ ప్ర‌భుత్వం పెట్టిన ష‌ర‌తుల‌ను ప‌రోక్షంగా అంగీక‌రించ‌డ‌మే?. అస‌లు మ్యానిఫెస్టోలో ఏముంది... నీవేం చేస్తున్నావ్‌... అని నిల‌దీయాల్సిన ప్ర‌తిప‌క్షం ష‌ర‌తుల్లో రంధ్రాన్వేష‌ణ చేయ‌డం అనుమానాల‌ను తావిస్తోంది. అంతేకాదు రైతులు రోడ్ల‌పైకి రావ‌డం లేదంటూ కొంద‌రు విశ్లేష‌కులు, సోకాల్డ్ మేధావులు చాన‌ళ్ల‌లో వ్యాఖ్యానిస్తున్నారు. అయినా రైతులు రోడ్ల మీద‌కు ఎందుకు రావాలి?. ఒక ఇంట్లో నాలుగు ల‌క్ష‌ల రుణం ఉంటే ల‌క్ష‌న్న‌ర రుణం మాఫీ అవుతుంది. వాస్త‌వంగా టీడీపీ మ్యానిఫెస్టో ప్ర‌కారం ఆ రైతు కుటుంబానికి అన్యాయం జ‌రిగిన‌ట్లే. ఆ విష‌యం ఆ రైతుకు కూడా తెలుసు. కానీ రోడ్డు మీద‌కొస్తే అయ్యే ల‌క్ష‌న్న‌ర మాఫీ ఆగుతుందేమో?. స్థానిక టీడీపీ నాయ‌కులు టార్గెట్ చేసి అడ్డుకుంటారేమోన‌ని భ‌య‌ప‌డ‌తారు. ఇది సాధార‌ణం. అంత‌మాత్రాన‌... రైతులు రోడ్డు మీద‌కు రానంత మాత్రాన టీడీపీ హామీ సంపూర్ణంగా అమ‌లైన‌ట్లా?. చంద్ర‌బాబు మోసం మాయ‌మ‌వుతుందా?. ఇలాంటి స‌మ‌యాల్లోనే ప్ర‌తిప‌క్షం, మీడియా నిల‌దీయాలి. రైతుల ప‌క్షాన నిల‌బ‌డి పోరాడాలి. వైఎస్ ల‌క్ష కోట్ల కుంభ‌కోణాల‌పై ఏ ప్ర‌జ‌లు వ‌చ్చి రోడ్డున ప‌డి ఆందోళ‌న చేశార‌ని ఈనాడు ఏళ్ల త‌ర‌బ‌డి పేజీల‌కు పేజీలు నింపింది. రామోజీరావు... జీజేరావు... అని ఏ రంగం ప్ర‌జ‌లు ఆ అంశాన్ని లేవ‌నెత్తార‌ని సాక్షి రోజుల త‌ర‌బ‌డి పేజీలు నింపింది. ఆయా అంశాల్లో వారి స్వార్థం ఉండ‌వ‌చ్చు. కానీ టీడీపీ హామీల అమ‌లు విష‌యంలో జ‌నం ప్ర‌యోజ‌నం ముడి ప‌డి ఉంది. ఇలాంటి స‌మ‌యాల్లోనే బ‌య‌టికిరాలేని రైతుల ప‌క్షాన నిల‌బ‌డి చంద్ర‌బాబును నిల‌దీయాల్సిన అవ‌స‌ర‌ముంది. ఎలాగూ ఆ క్ష‌ణం వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం నాకు లేదు. కానీ ఆ క్ష‌ణం వ‌స్తే బాగుండ‌ద‌ని ఓ చిన్ని అత్యాశ‌!!!

No comments:

Post a Comment