రెండ్రోజుల కిందట ఒక పత్రికలో వచ్చిన వార్తపై నేను వివరాలు రాబట్టాను. దాని ద్వారా తెలిసిందేమిటో తెలుసా... తెలంగాణ ప్రభుత్వంలో రెండు శాఖలు ఒకే అంశంపై భిన్నంగా జీవోలు ఇవ్వడం. హైదరాబాద్‌లోని వాటర్ వర్క్స్ డిపార్టుమెంటులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టు ఉంది. ఇది ఖాళీగా ఉండటంతో చాలా రోజుల కిందటనే కేసీఆర్ ఆదేశంతో ప్రభుత్వం (జీఏడీ విభాగం) ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆ పోస్టుకు బదిలీ చేసింది. ఆతర్వాత వాటర్ వర్క్స్‌లో పని చేసే ఇద్దరు ఇంజినీర్లకు ప్రమోషన్ ఇస్తూ నాలుగు రో్జుల కిందట ప్రభుత్వం (పురపాలక శాఖ) మరో జీవో ఇచ్చింది. ఇందులో వాటర్ వర్క్స్‌లోని ఒక సీనియర్ అధికారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించినట్లు ఆ జీవోలో చెప్పింది. అంటే గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ను నియమించిన పోస్టులోనే మరో అధికారిని నియమిస్తున్నట్లు ఆదేశాలు వచ్చాయి. ఇదెలా సాధ్యం...?. ఒకే పోస్టులో ఇద్దరెలా ఉంటారు?. దీని వెనక అసలు కథ ఏమిటంటే... ప్రమోషన్ పొందిన ఇద్దరు ఇంజినీర్లలో ఒకరు అనర్హుడట. అతని సంబంధిత విద్యార్హతను పూర్తి చేయకుండానే (సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 24 సబ్జెక్టులు పాస్ కావాల్సి ఉంటే 14 మాత్రమే పాస్ అయ్యాడు) ప్రమోషన్లు పొందుతున్నాడట. ఈ విషయంపై సీఎం పేషీకి అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు కూడా అందిందట. అందుకే వెంటనే రెండోసారి జారీ అయిన జీవో అమలు కాకుండా నిలిపివేశాటర. బాగానే కళ్లు తెరిచారు. ఇంతవరకు బాగానే ఉంది. పైగా పరిపాలనలో తప్పిదాలు దొర్లడం సహజమే. కానీ దీని వెనక అసలు తంతు నాకు బాధ కలిగించింది. ఆ ఇద్దరు ఇంజినీర్లకు ప్రమోషన్లు ఇప్పించడంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఒక వ్యక్తి సూత్రధారిగా వ్యవహరించారు. సచివాలయంలో ఉద్యమాల్లో పాల్గొన్న వారే కాదు... తెలంగాణలోని సాధారణ వ్యక్తి కూడా పైరవీ చేయడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ విషయానికొస్తే నిన్నటిదాకా సచివాలయమంటే ఆంధ్రోళ్ల అడ్డాగా పరిఢవిల్లింది. కానీ ఇప్పుడు తెలంగాణవారితో కిటకిటలాడటం, వారు తమ పనులు మన ప్రభుత్వంతో చేయించుకోవడం చాలా సంతోషకరం. కాకపోతే ఇలాంటి పనులు చేసే సమయంలో తెలంగాణ భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడటం మన బాధ్యత. ఎందుకంటే హైదరాబాద్‌లో వాటర్ వర్క్స్ అనేది కీలకమైన శాఖ. రానున్న రోజుల్లో 20వేల కోట్లతో ప్రాజెక్టులు రానున్నాయి. ఇలాంటి ప్రధానమైన శాఖలో అనర్హులు అందలం ఎక్కేలా మనం సహకరిస్తే అభివృద్ధి నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారతాయి. అందుకే మన మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండేవారు పనులు చేయించుకోండి. తప్పులేదు... మన సర్కారుతో పనులు చేయించుకునే హక్కు మనకు ఉంది. కాకపోతే అందులో మన సమాజానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా విఘాతం కలగకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం అభాసుపాలు అయ్యే పనులు మాత్రం దయచేసి చేయకండి.
No comments:
Post a Comment