మిస్టర్ అద్వానీజీ... ఇప్పుడేల మౌనం?.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు సీమాంధ్ర ఎంపీలు సృష్టించిన బీభత్స కాండపై యావత్ భారతదేశం భగ్గుమంది. కానీ రాజకీయ కురువృద్దుడు మిస్టర్ అద్వానీజీ మాత్రం భిన్నంగా స్పందించారు. చివరి దశలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు బిల్లు పెడుతుందో?. అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన గతంలో ఎన్నడూ ఇలాంటి సభను చూడలేదంటూ వాపోయారు. నిజమే... మరి శుక్రవారం జరిగిన సభను అద్వానీజీ గతంలో ఎన్నడైనా చూశారా?. పో్లవరం ఆర్డినెన్స్ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఎన్డీయే ప్రభుత్వం చూపించిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ముజువాణి ఓటుతో ఆ బిల్లును ఆమోదించిన తీరు చాలా బాధాకరం. మరి ఇప్పుడు అద్వానీజీ ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదు. ఒకవైపు మూడు రాష్ట్రములకు చెందిన ఎంపీలు తమ గోడు వినండంటూ పోడియం వద్ద గొల్లుమంటున్నా... పక్కనే ఉన్న అద్వానీజీ ఎందుకు స్పందించలేదు?. నిజమే... కేంద్ర సర్కారుకు ఇంత తొందర ఎందుకు?. దేశ ప్రజలు సంపూర్ణంగా ఐదేళ్ల పాటు ఉండేందుకు ఆ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఆ బిల్లును ఆమోదించేందుకు తొందరేం వచ్చింది?. అసలు వ్యతిరేకిస్తున్న ఎంపీల మనోభావం ఏమిటి?. వారి అభ్యంతరాలేమిటి?. అని బీజేపీగానీ అద్వానీజీగానీ తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు?. కేవలం చంద్రబాబు, వెంకయ్యనాయుడు చెప్పడమే ప్రామాణికంగా హడావుడిగా బిల్లును ఆమోదించారు. మరి ఇది ప్రజాస్వామ్యంలో దురదృఫ్టకర సంఘటన కాదా?. నోరులేని అమాయక ఆదివాసీలకు ఢిల్లీలో చక్రం తిప్పే సామర్థ్యం లేదు. మీడియాను మేనేజ్‌చేసి గంటల తరబడి చర్చలు, రోజంతా హడావుడి చేసే చాకచక్యం కూడా లేదు. ఇలాంటి తరుణంలో వారి గోడు ఎవరు వినాలి?. మూడు, నాలుగు జిల్లాల మూడో పంట కోసం లక్షలాది మంది గిరిపుత్రులను నిలువునా ముంచి, వారి సంస్కృతి, సంప్రదాయాలను జల సమాధి చేసే అధికారం ఎవరు ఇచ్చారు?. నాలుగు కోట్ల జనం ఆకాంక్షను నెరవేస్తున్న సమయంలోనే అద్వానీజీ ఆవేదన చెందారే... మరి శుక్రవారం జరిగిన సభ ఎంతమంది ఆకాంక్షను నెరవేర్చింది?. మరెంత మంది జీవితాలను నడివీధిలోకి తెచ్చింది?. రాజకీయ దిగ్గజమైన అద్వానీజీ కించిత్తయినా వీటి గురించి ఆలోచించారా?. అంతెందుకు ఆయన ఓ విషయాన్ని గుర్తించాలి. హైదరాబాద్ తమకు దక్కడంలేదనే వాస్తవాన్ని జీర్ణించుకోలేని లగడపాటి ఏకంగా పవిత్రమైన స్థలంలో పెప్పర్‌స్ప్రే చల్లి, తోటి ఎంపీలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ శుక్రవారం రోజు తెరాస, ఇతర ఎంపీలు ప్రజాస్వామ్యబద్దంగా తమ నిరసన వ్యక్తం చేశారే తప్ప కించిత్తు కూడా సభా మర్యాదలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించలేదు. అద్వానీజీ... ఇది చాలదా!. ఎవరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారు.. మరెవరు కించపరిచేవారనేది. ఎలాగూ అధికారం, అంగ బలం ఉందని ఈరోజు ఎన్డీయే అమాయక గిరిజనులను సమాధి చేసే బిల్లును నెగ్గించుకోవచ్చు. కానీ వారి గోస, వారి ఆవేదన కచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. బీజేపీ, అద్వానీజీ ఈరోజు మిత్ర ధర్మాన్ని నెగ్గించుకున్నామని సంబరపడొచ్చు. కానీ అదే సమయంలో మానవతా ధర్మానికి ఘోరీ కట్టారనే వాస్తవాన్ని మాత్రం మరవద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారం ఐదేళ్లు మాత్రమే!!!