1

1

Wednesday, 16 September 2015

పుష్క‌ర పాఠాలు..

పుష్క‌ర పాఠాలు..
****************
పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించామ‌ని ఆనందంగానే ఉన్నాం. అయితే కొన్ని లోటుపాట్ల‌ను మ‌నం గుర్తించాం. వాటిని భ‌విష్య‌త్‌లో అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నించాలి.. అలాగే కొన్ని అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని దేశంలో మ‌న గుర్తింపును చాటుకునే ప్ర‌య‌త్నం చేశాం..
1. పుష్క‌రాల సంద‌ర్భంగా తెలంగాణ‌లో నాలుగు వ‌రుస‌ల ర‌హ‌దారులు లేక‌పోవ‌డం, కొన్ని ప్రాంతాల్లో రెండు వ‌రుస‌ల ర‌హ‌దారులు కూడా స‌రిగా లేని విష‌యాన్ని మ‌నం గుర్తించ‌గ‌లిగాం. ఈ నేప‌థ్యంలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, నూత‌న ర‌హ‌దారుల నిర్మాణంపై ప్ర‌భుత్వం దృష్టిసారించాలి. కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకు రావాలి...
2. తెలంగాణ‌లో ఆర్టీసీలో గ‌రిష్ఠంగా 5-6 వేల బ‌స్సులు ఉన్నాయి. ఈ బ‌స్సుల‌తో కోట్ల మంది భ‌క్తుల‌ను త‌ర‌లించ‌లేం.. తెలంగాణ‌కు ఉన్న ప్ర‌ధాన లోటు రైల్వే క‌నెక్టివిటీ లేక‌పోవ‌డం.. ఇది పుష్క‌రాల్లో సుస్ప‌ష్టంగా క‌నిపించింది. ఆంధ్రాకు వంద‌ల్లో ప్ర‌త్యేక రైళ్లు న‌డిచాయి. ఇక్క‌డ రైళ్లు
న‌డిపేందుకు మార్గ‌మే లేదు.. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఆధ్యాత్మిక కేంద్రాల‌కు రైలు నెట్‌వ‌ర్కు ఉండేలా కృషి చేయాలి.. అలాగే ఆర్టీసిని మ‌రింత‌గా బ‌లోపేతం చేయాలి.
వ‌చ్చే పుష్క‌రాల నాటికి ధ‌ర్మ‌పురి క్షేత్రానికి రైలు నెట్ వ‌ర్కు వ‌స్తే ఎంతో బాగుంటుంది. రైల్వే నెట్‌వ‌ర్కు ఉంటే ఆర్టీసీపై కొంత భారం త‌గ్గుతుంది. దీనిపై స‌ర్కారు దృష్టిసారించాలి.
3. పుష్క‌రాల సంద‌ర్భంగా కేవ‌లం మ‌న చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల నుంచి తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డిపింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర రాష్ట్రాల నుంచి టూరిస్టుల‌ను ఇక్క‌డికి తీసుకురావ‌డం మంచి ప‌రిణామం.. కేవ‌లం టూరిజం అంటే మ‌న వారికి మ‌న ప్ర‌దేశాలు చూప‌డం కాద‌ని, ఇత‌ర రాష్ట్రాలు, దేశాల‌కు మ‌న విశిష్ట‌త‌ల‌ను చాట‌డం అన్న విష‌యాన్ని దృష్టిలో ఉంచుకొని ప‌ర్యాట‌క శాఖ ప‌నిచేసింది.. వాళ్ల‌ను అభినందించాలి.
4. తెలంగాణ‌లో ఆధ్యాత్మిక‌, టెంపుల్ టూరిజానికి మంచి స్పంద‌న ఉంటుంద‌ని, ఆ దిశ‌గా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించాలి. యాద‌గిరి గుట్ట త‌ర్వాత‌, ధ‌ర్మ‌పురి, కాళేశ్వ‌రం, గూడెం, బాస‌ర‌ల‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.. ఈ ప్రాంతాల‌ను మ‌రింత ఎక్కువ‌గా అభివృద్ధి చేయాలి.. వ‌స‌తులు క‌ల్పించాలి. రెండు మూడు ప్రాంతాల‌ను క‌లిపే టూరిజం స‌ర్క్యుట్స్‌ను అభివృద్ధి చేయాలి. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో హ‌రిత హోట‌ళ్ల నిర్మాణం చేప‌ట్టాలి.
5. ఇక కోటిలింగాల లాంటి ప్రాంతాల్లో చారిత్ర‌క సంప‌ద ఉంది.. దీన్ని కాపాడటం, ఈ ప్రాంతానికి బ‌స్సు సౌక‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డం లాంటివి చేయాలి. వీలైతే నాగార్జున కొండ‌లో ఎలాగైదే సంప‌ద‌ను భ‌ద్ర‌ప‌రిచారో అలాంటి ఏర్పాట్ల‌ను ప్ర‌భుత్వం చేయాలి.
6. తెలంగాణ గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతం ఎక్కువ‌గా ఉంది.. ఈ నేప‌థ్యంలో అనువైన చోట బోటింగ్ స‌దుపాయాన్ని క‌ల్పించాలి. పోచంపాడ్‌, కోటిలింగాల‌, ఇంకా ఏదైనా ప్రాంతంలో ఈ బోటింగ్‌ను ఏర్పాటు చేయాలి.
7. పుష్క‌రాల సంద‌ర్భంగా జిల్లాల్లో ట్రాఫిక్ జామ్ పెరిగింది. ట్రాఫిక్ నియంత్ర‌ణ‌పై దృష్టి సారించాలి. డివైడ‌ర్లు లేక‌పోవ‌డం వ‌ల్ల కొన్నిచోట్ల ఇబ్బందులు వ‌చ్చాయి. ఇక కూడ‌ళ్ల‌లో ట్రాఫిక్ సిగ్న‌ల్స్ లేక‌పోవ‌డమూ స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెట్టింది.
8. గోదావ‌రిలో నీళ్ల కొర‌త మ‌నం ప్ర‌త్య‌క్ష్యంగా చూశాం. ఈ నేప‌థ్యంలో డ్యాంల నిర్మాణం చేయ‌డం వ‌ల్ల క‌నీసం బ్యాక్ వాట‌ర్‌ను నిల్వ ఉంచుకోవ‌డం చేయొచ్చు.. కోటిలింగాల‌, ఎల్లం ప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లో బ్యాక్ వాట‌ర్ వ‌ల్ల భ‌క్తులు పుష్క‌ర స్నానం చేయ‌గ‌లిగారు.
9. బాస‌ర‌లో అసౌక‌ర్యాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఫిర్యాదుల వ‌చ్చాయి(నేను చూడ‌లేదు). అక్క‌డ త‌ప్పు ఎవ‌రిదో విచారించాలి. దోషుల‌ను శిక్షించాలి.
10. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర జ‌ర‌గ‌నుంది. మ‌ళ్లా ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్లు స‌రిగా లేక‌పోవ‌డం ఇత‌ర స‌మ‌స్య‌లు లేకుండా ముందునుంచే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.
11. ఎమ్మెల్యే ప్ర‌శాంత్ రెడ్డి గారు నిగ్ర‌హం కోల్పోయి ఓ కానిస్టేబుల్‌పై బూతుపురాణం వినిపించ‌డం త‌ప్పు.. ప్ర‌జా ప్ర‌తినిధులు ఎవ‌రైనా స‌రే సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తే వారికి మంచిది. ఆయ‌న ఇలాంటి త‌ప్పులు పున‌రావృతం చేయ‌ర‌ని ఆశిద్దాం.

No comments:

Post a Comment