1

1

Tuesday, 12 January 2016

హైద‌రాబాద్ నిండా సెటిల‌ర్ల ఓట్లే ఉన్నాయా?

ఇదేం ప‌ద్ధ‌తో ఏంటో?
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాదీల‌ ఓట్లు రావ‌ని భ‌య‌మా?
లేక హైద‌రాబాద్ నిండా సెటిల‌ర్ల ఓట్లే ఉన్నాయా?
*******
తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో సెటిల‌ర్ల‌ను మ‌నం ఏమైనా అన్నామా? మా పొట్ట కొట్టే వారితోనే మా పంచాయితీ కానీ పొట్ట కూటి కోసం వ‌చ్చిన వారితో ఎలాంటి పంచాయితీ లేద‌ని మాత్ర‌మే క‌దా అన్న‌ది... ఇక 2009 ఎన్నిక‌ల్లో, 2014 ఎన్నిక‌ల్లోనూ కేసీఆర్ ప్ర‌చారం చేస్తూ సెటిల‌ర్ల కాలికి ముళ్లు గుచ్చుకుంటే మా పంటితో తీస్తామ‌ని, క‌డుపులో పెట్టుకుని చూస్తామ‌ని అన్నారు క‌దా.. తెలంగాణ వ‌చ్చాక అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లూ జ‌రిగాయి. కేసీఆర్ నాయ‌క‌త్వంలో 18 నెల‌లు సాఫీగా సాగింది. ఈ 18 నెల‌ల్లోనూ సెటిల‌ర్ల‌పై దాడులు జ‌ర‌గ‌లేదు.. వారిని ప‌ల్లెత్తు మాట అన‌లేదు.. మ‌రి ఉద్య‌మ స‌మ‌యంలో సెటిల‌ర్ల‌ను మ‌నం ఏదో అన్న‌ట్లుగా అవ‌న్నీ మ‌న‌సు లో పెట్టుకోవ‌ద్దంటూ ఈ మ‌ధ్య కాలంలో కేటీఆర్ గారు అన‌డం అస‌లు న‌చ్చ‌డం లేదు.. మ‌నం గ‌తంలో త‌ప్పు చేయ‌లేదు.. వ‌ర్త‌మానంలోనూ చేయ‌డం లేదు..
***********
ప్ర‌స్తుతం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లను చూస్తుంటే అప్ప‌ట్లో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అన్న మాట నిజ‌మేనేమో అన్న రీతిలో టీఆర్ఎస్ స‌హా అన్ని రాజ‌కీయ పార్టీల ప్ర‌చారం సాగుతోంది. హైద‌రాబాద్ అంతా మేమే(ఆంధ్రా సెటిల‌ర్లు) ఉన్నామ‌ని ల‌గ‌డ‌పాటి, ఇత‌ర ఆంధ్రా నేత‌లు అన్నారు.. ఆ స‌మ‌యంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎంత స‌ర్వే చేసినా 5 ల‌క్ష‌ల మందికి మించి లేర‌ని వాదించారు. మ‌రి హైద‌రాబాద్ లో కోటి మంది ఉంటే అందులో ఉన్న 5 ల‌క్ష‌ల మందిని ఊర‌డించ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్‌, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారం చేయ‌డం ఏంటి? ఈ త‌ర‌హా ప్ర‌చారం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌నికి వ‌స్తుందేమో కానీ.. రానున్న రోజుల్లో యావ‌త్తు తెలంగాణ స‌మాజం ముందు మ‌ళ్లా మీరు ఏ మాట‌లు చెప్పి ప్ర‌చారానికి వెళ్తారో ఆలోచించుకోవాలి... సెటిల‌ర్ల‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి కూడా సిద్ధంగా ఉన్నామ‌నే రాజ‌కీయ నేత‌ల్లారా... ఏ త‌ప్పు చేశామ‌ని క్ష‌మాప‌ణ‌లు కోర‌దాం అనుకుంటున్నారు... తెలంగాణ స‌మాజాన్ని అను నిత్యం అవ‌మానించిన పెద్ద మ‌నుషులు క‌నీసం తాము త‌ప్పుగా మాట్లాడామ‌ని ఇప్ప‌టికీ అంగీక‌రించ‌డం లేదు.. అలాంటిది ఏ త‌ప్పూ చేయ‌ని మీరు మ‌నం అంతా గ‌తంలో త‌ప్పులు చేసిన‌ట్లుగా ఇప్పుడు మాట్లాడ‌టం అంటే అది తెలంగాణ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మే...
*****************
హైద‌రాబాద్ లో అంద‌రం సెటిట‌ర్ల‌మే అంటున్నారు కొంద‌రు.. తెలంగాణ జిల్లాల నుంచి వ‌చ్చిన వారు కూడా సెటిల‌ర్లే అన్న‌ట్లుగా మాట్లాడుతున్నారు.. తెలంగాణ జిల్లాల నుంచి వ‌చ్చి హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డిన వారు ఎప్పుడూ మేం సెటిల‌ర్ల‌మ‌ని భావించ‌లేదు.. మేం తెలంగాణ‌వాళ్లం, హైద‌రాబాదీలం అని మాత్ర‌మే భావిస్తున్నారు.. ఈ భావ‌న లోపించిన వారు మాత్ర‌మే తాము సెటిల‌ర్లం అని ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు.. ఇప్పుడు తెలంగాణ నేత‌లుకూడా తాము హైద‌రాబాద్ లో సెటిల‌ర్లం అన్న భావ‌న లో ఉంటే.. వారు తెలంగాణ లోని మిగ‌తా జిల్లాల ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతున్న‌ట్లే లెక్క‌.. !
నోట్ : హైద‌రాబాద్ లో ఏ ప్రాంతం నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డినా స‌రే తాము హైద‌రాబాదీల‌మ‌నో లేక తెలంగాణ వారిమి అన్న భావ‌న రాని వాళ్లే నా దృష్టిలో నిజ‌మైన సెటిల‌ర్లు..!!

నిజ‌మైన మ‌హిళా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు సీట్లు ఇవ్వండి ప్లీజ్‌...

నిజ‌మైన మ‌హిళా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు సీట్లు ఇవ్వండి ప్లీజ్‌...
సీట్ల రిజ‌ర్వేష‌న్ల త‌ర్వాత వెలుగులోకి వ‌చ్చే నాయ‌కుడి భార్య‌కో, చెల్లికో, అక్క‌కో, కోడ‌లికో, వ‌దిన కో ఇవ్వ‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాదు
***********
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చారు. అంటే స‌గం స్థానాల్లో మ‌హిళా అభ్య‌ర్థుల‌కే కేటాయిస్తారు. అయితే అన్ని పార్టీల్లోనూ పురుష నాయ‌కులు, మ‌హిళా నాయ‌కులు ఉన్నారు. పాపం పురుష నాయ‌కులు ఒక స్థానంపై ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆ స్థానం మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వు కావ‌డం తో ఏం చేయాలో తెలియ‌క వాళ్లంతా వాళ్ల స‌తీమ‌ణుల‌ను రంగంలోకి దింపుతున్నారు. వాళ్ల స‌తీమ‌ణులు అప్ప‌టి వ‌ర‌కు జ‌నంలో తిరిగిన వాళ్లు కాదు. క‌నీసం రాజ‌కీయ ప‌రిజ్ఞానం, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న లేదు. ఇలాంటి వారికి ఆయా పార్టీలు ఒక‌వేళ సీట్లు కేటాయిస్తే చివ‌ర‌కు భ‌ర్త‌లే పెత్త‌నం చెలాయిస్తారు. అందుకే పార్టీ కోసం ఎక్కువ‌గా శ్ర‌మించిన నిజ‌మైన మ‌హిళా నాయ‌కులకే అన్ని పార్టీలు సీట్లు ఇవ్వాలి. అంతే కానీ ఓ నాయ‌కుడి భార్య‌కో, చెల్లికో, అక్క‌కో, కోడ‌లికో, వ‌దిన కో ఇవ్వ‌డం మంచి ప‌ద్ధ‌తి కాదు. అయితే ఒక‌వేళ భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ రాజ‌కీయాల్లో ఉంటే ఇవ్వ‌డం లో త‌ప్పు లేదు.. అంతే కానీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌కు సీటు రిజ‌ర్వు అయింది అన్న ఒక్క కార‌ణంతో ఇంట్లోని వ‌నిత‌ల‌ను పోటీల‌కు దించే వారికి ప్రాధాన్యం ఇవ్వొద్ద‌ని నా మ‌న‌వి. ఇంట్లో భ‌ర్త‌, పిల్ల‌లు, కుటుంబ స‌భ్యుల క‌న్నా ఎక్కువ‌గా పార్టీకి స‌మ‌యం కేటాయించిన నిజ‌మైన మ‌హిళా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు అన్యాయం జ‌రుగుతుంది. ఈ విష‌యంపై అన్ని పార్టీలు దృష్టి సారిస్తే బాగుంటుంది.

Monday, 11 January 2016

జై జ‌వాన్‌...

జై జ‌వాన్‌...
******
ఎంద‌రు క‌స‌బ్ లు చొర‌బ‌డ్డా.. ఎన్ని ముష్క‌ర దాడులు చేసినా స‌రే మేం భ‌య ప‌డ‌బోం.. మా ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ తీయ‌లేరు.. ఎందుకంటే అనునిత్యం మా ప్రాణాల‌ను కాపాడేందుకు త‌మ ప్రాణాల‌ను అడ్డుగా పెట్టి స‌రిహ‌ద్దుల్లోనూ, స‌మాజంలోనూ ప‌హారా కాస్తున్న వీర సైనికులున్న మ‌హోన్న‌త దేశం నాది. ప్రాణం క‌న్నా దేశ మాత ర‌క్ష‌ణే మిన్న అంటూ ప్రాణాల‌ను తృణ ప్రాయంగా వ‌దులుతున్న యోధుల‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది. మూడు రోజులుగా మ‌నం అంతా ప్ర‌శాంతంగా నిద్రిస్తున్నాం. ఎన్నో వ్యాప‌కాల్లో బిజీగా ఉన్నాం. కానీ మ‌న సైనికులు మాత్రం నిద్రాహారాలు మాని ముష్క‌ర మూక‌ల ఏరివేత‌లో నిమ‌గ్న‌మైంది. మ‌న‌ల్ని ప్ర‌శాంతంగా ఉంచేందుకు వాళ్లు ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి పోరాడుతున్నారు. అలాంటి యోధుల‌ను క‌న్న మాతృమూర్తుల‌కు పాదాభివంద‌నం. దేశ సేవ‌లో అమ‌రులైన వీరులారా.. ఈ గ‌డ్డ మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ మ‌రువ‌దు.. మా హృద‌యాల్లో మీరు, మీ త్యాగం స‌దా నిలిచిపోతుంది.
జై జ‌వాన్‌.. జై హింద్‌..!