1

1

Friday, 5 February 2016

ఆయ‌న మంత్రా.. లేఖ‌లు ఫార్వ‌ర్డు చేసే త‌పాలా బంట్రోతా...!!

ఆయ‌న మంత్రా.. లేఖ‌లు ఫార్వ‌ర్డు చేసే త‌పాలా బంట్రోతా...!!
త‌న‌కు వ‌చ్చిన విజ్ఞాప‌న ప‌త్రాన్ని ఫార్వ‌ర్డు చేశానంతే అని బుకాయిస్తున్న పెద్దాయ‌న‌..
నిజానిజాలు తెలుసుకోకుండా ఎవ‌రు ఏం ఇచ్చినా ఇలాగే పంపుతారా ఏంటి?
*******
నేను ఫ‌లానా నియోజ‌క‌వ‌ర్గానికి ఎంపీని... నా ప‌రిధిలో ఉండే వాళ్లు వ‌చ్చి నాకు ఏ విజ్ఞాప‌న ప‌త్రం అందించినా వాటిని సంబంధిత శాఖ‌లు ఫార్వ‌ర్డు చేయ‌డ‌మే క‌ర్త‌వ్యంగా భావిస్తాను.. తాజాగా ఓ వ‌ర్సిటీలో జ‌రిగిన ఘ‌ట‌న‌లోనూ నాకు రెండు సార్లు విజ్ఞాప‌న‌లు అందాయి.. అందిన వాటిని అందిన‌ట్లుగా ఫార్వ‌ర్డు చేశాను అంటున్నారు స‌ద‌రు మంత్రి గారు....
మ‌రో వ‌ర్గం విద్యార్థులు ఇచ్చినా నేను అలాగే చేసే వాడిని అని సెల‌విస్తున్నారు ఆ పెద్దాయ‌న‌...
****
అయ్యా అమాత్యుల వారు.. మీరు వ‌చ్చిన వాటిని వ‌చ్చిన‌ట్లు ఫార్వ‌ర్డు చేయ‌డానికి త‌పాలా బంట్రోతు కాదు క‌దా... గౌర‌వ ప్ర‌ద‌మైన మంత్రి ప‌ద‌విలో ఉన్న మీరు మొద‌ట నిజానిజాలు తెలుసుకొని ఆ త‌ర్వాత మీ వైఖ‌రిని సద‌రు మంత్రిత్వ శాఖ‌ల‌కు తెల‌పాలి క‌దా... మ‌రి మీరేమైనా ఎక్వైరీ చేశారా? చేయ‌కుండానే కేంద్రానికి లేఖ‌లు రాశారా?
***
ఇంకో విష‌యం... మ‌రో వ‌ర్గం వారు రేపు వ‌చ్చి ఇంకో వ‌ర్గంపై ఫిర్యాదు చేస్తే ఇలాగే ఆ వ‌ర్గం విద్యార్థిని స‌స్పెండ్ చేయించ‌గ‌ల‌రా? అలా స‌స్పెండ్‌
చేయిస్తానంటే ఇప్పుడు బాధిత వ‌ర్గీయుల‌తో ఓ విజ్ఞాప‌న ప‌త్రాన్ని మీకు పంపుతాం...

విద్యార్థుల విష‌యంలో మాన‌వ‌తా దృక్ప‌థాలు ఈ మంత్రుల‌కు క‌నిపించ‌వు..

ల‌లిత్ మోడీ కేసులో సుష్మా స్వరాజ్‌
ఇప్పుడు రోహిత్ కేసులో ద‌త్తాత్రేయ‌, స్మృతి ఇరానీ...
లేఖ‌లు రాయ‌డం, సిఫార్సులు చేయ‌డం వీళ్ల‌కు ఫ్యాష‌న్ కావొచ్చు..
ల‌లిత్ మోడీ కేసులో మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించామ‌ని బుకాయింపు..
రోహిత్ కేసులో విశ్వ‌విద్యాల‌యాల‌ను ప‌రిర‌క్షించాల‌నే ల‌క్ష్యంతో స్పందించామ‌ని ఢాంబికాలు..
వీళ్లు ఏం చేసినా అది క‌రెక్టు అనుకోవాలంతే...
ఏముంది ఓ నెల‌, రెండు నెల‌లు మీడియాలో సీన్ న‌డుస్తుంది. త‌ర్వాత లలిత్ మోడీ కేసును మ‌రిచిన‌ట్లే ఈ కేసును జ‌నం మ‌రిచిపోతార‌న్న ధీమానేమో...!!
ఏది ఏమైనా జ‌నానికి ఉన్న‌ మ‌తి మ‌రుపు గుణం వీళ్ల‌కు వ‌రం అయింది..
******
నోట్ : ఆర్థిక ఉగ్ర‌వాది అయిన ల‌లిత్ మోడీ గారి విషయంలో మాన‌వ‌తా దృక్ప‌థాలు క‌నిపిస్తాయి... విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుకునే విద్యార్థుల విష‌యంలో మాన‌వ‌తా దృక్ప‌థాలు ఈ మంత్రుల‌కు క‌నిపించ‌వు.. ఏంటో ఈ విచిత్రం..

ఫేసుబుక్ లో శిక్ష‌లు కూడా విధించే వారా కాదా?

చిన్న సందేహం...
****
మొన్న ఓ ఉగ్ర ఘ‌ట‌న జ‌రిగింది.. ఉగ్ర‌వాదుల‌కు ఓ ఎస్పీ స‌హ‌క‌రించాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.. ఒక‌వేళ‌ ఆ ఎస్పీ ఖాన్ అయి ఉంటే ఈ పాటికి అస‌లు బాధ్యుడు ఆయ‌నే.. ఇంటి దొంగ నే పాక్ ఉగ్ర‌వాదుల‌కు స‌హ‌క‌రించాడ‌ని అనే వాళ్లా కాదా? కేసులో నిజ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌క‌ముందే దోషిగా చేసి ఫేసుబుక్ లో శిక్ష‌లు కూడా విధించే వారా కాదా? ఈ ర‌కం ధోర‌ణి మారాల‌ని కోరుకుంటున్నా..

ఉస‌ర‌వెల్లుల్లా అవ‌స‌రానికి ర‌క‌ర‌కాల‌ దేశ భ‌క్తి చొక్కాలు ధ‌రిస్తారు..



ఇందిరా గాంధీ హంతకుల‌ను దేశ‌భ‌క్తులు, అమ‌ర‌వీరులుగా కీర్తిస్తూ ఓ మ‌త సంస్థ ప్ర‌క‌టించిన‌ప్పుడు తెర‌చుకోని గొంతుక‌లు..
పంజాబ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన బియాంత్ సింగ్ ను చంపిన కిరాత‌కుడిని బ‌తికి ఉన్న అమ‌రుడిగా శిరోమ‌ణి అకాలీ ద‌ల్ నేత‌లు ప్ర‌క‌టించిన‌ప్పుడు పెగ‌ల‌ని నోళ్లు..
ఇక త‌మిళ సార్వ‌భౌమ‌త్వం అంటూ నిర‌స‌న‌లు జ‌రిగిన స‌మ‌యంలో స్పందించని మ‌నుషులు...
***********
ఇప్పుడు మాత్రం తెగ హ‌డావుడి చేస్తున్నారు... దేశ భ‌క్తి ఉప‌న్యాసాలు ఇస్తున్నారు... వీళ్లు న‌యా దేశ భ‌క్తులు... ఉస‌ర‌వెల్లుల్లా అవ‌స‌రానికి ర‌క‌ర‌కాల‌ దేశ భ‌క్తి చొక్కాలు ధ‌రిస్తారు.. వీళ్ల దృష్టిలో వీళ్లు మాత్ర‌మే దేశ భ‌క్తులు..

ఉరి శిక్ష‌లు ర‌ద్దు చేయాల‌నే వాళ్లంతా దేశ ద్రోహులు, సంఘ విద్రోహ శ‌క్తుల‌ని ముద్ర‌లు వేస్తారు..

మ‌హాత్మాగాంధీని చంపిన దేశ మొద‌టి ఉగ్ర‌వాది / తీవ్ర‌వాది అయిన‌ నాథూరాం గాడ్సేను దేవుడని కొలిచి గుడులు క‌డ‌తాం అన్న వాళ్లంతా దేశ భ‌క్తులు అవుతారు.. పార్ల‌మెంట్ లో కూర్చుంటారు... వారిపై నిషేధాలు ఆంక్ష‌లు ఉండ‌వు.. కానీ ఉరి శిక్ష‌లు ర‌ద్దు చేయాల‌నే వాళ్లంతా దేశ ద్రోహులు, సంఘ విద్రోహ శ‌క్తుల‌ని ముద్ర‌లు వేస్తారు..

వారిని దేశ ద్రోహులు, జాతి ద్రోహులు, సంఘ విద్రోహ శ‌క్తుల‌ని అభివ‌ర్ణించ‌గ‌ల‌రా?

నిన్న‌నే ఒక వార్త చూశాను..
***
రాజీవ్ గాంధీ హంత‌కులను విడుద‌ల చేయాల‌ని త‌మిళ‌నాడు సినీ ప‌రిశ్ర‌మ యావ‌త్తు నిర‌శ‌న దీక్ష‌ల‌కు, ఆందోళ‌న‌కు దిగ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసింది..
దేశ ప్ర‌ధానిగా ప‌నిచేసిన వ్య‌క్తిని హ‌త‌మార్చిన ఉగ్ర‌వాదుల‌ను విడుద‌ల చేయాల‌ని, వారికి సంఘీభావం తెలిపిన త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ను బహిష్క‌రించాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేస్తారా?
త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆంక్ష‌లు విధించ‌గ‌ల‌రా?
క‌నీసం వారిని దేశ ద్రోహులు, జాతి ద్రోహులు, సంఘ విద్రోహ శ‌క్తుల‌ని అభివ‌ర్ణించ‌గ‌ల‌రా?
**********
ఇదే త‌ర‌హాలో ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాదుల‌కు అనుకూలంగా బాహాటంగా ప్ర‌క‌ట‌న‌లిచ్చే బీజేపీ అధికారిక మిత్ర‌ప‌క్ష‌మైన శిరోమ‌ణి అకాలీ ద‌ల్ పైన నిషేధం విధించాల‌నో, వారిపై ఆంక్ష‌లు పెట్టాల‌నో, అరెస్టు చేయాల‌నో కూడా బీజేపీ నేత‌లు కేంద్రానికి లేఖ‌లు రాయ‌డం, కేంద్రంపై ఒత్తిడి చేయ‌డం చేయ‌గ‌ల‌రా?

Tuesday, 12 January 2016

హైద‌రాబాద్ నిండా సెటిల‌ర్ల ఓట్లే ఉన్నాయా?

ఇదేం ప‌ద్ధ‌తో ఏంటో?
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాదీల‌ ఓట్లు రావ‌ని భ‌య‌మా?
లేక హైద‌రాబాద్ నిండా సెటిల‌ర్ల ఓట్లే ఉన్నాయా?
*******
తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో సెటిల‌ర్ల‌ను మ‌నం ఏమైనా అన్నామా? మా పొట్ట కొట్టే వారితోనే మా పంచాయితీ కానీ పొట్ట కూటి కోసం వ‌చ్చిన వారితో ఎలాంటి పంచాయితీ లేద‌ని మాత్ర‌మే క‌దా అన్న‌ది... ఇక 2009 ఎన్నిక‌ల్లో, 2014 ఎన్నిక‌ల్లోనూ కేసీఆర్ ప్ర‌చారం చేస్తూ సెటిల‌ర్ల కాలికి ముళ్లు గుచ్చుకుంటే మా పంటితో తీస్తామ‌ని, క‌డుపులో పెట్టుకుని చూస్తామ‌ని అన్నారు క‌దా.. తెలంగాణ వ‌చ్చాక అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లూ జ‌రిగాయి. కేసీఆర్ నాయ‌క‌త్వంలో 18 నెల‌లు సాఫీగా సాగింది. ఈ 18 నెల‌ల్లోనూ సెటిల‌ర్ల‌పై దాడులు జ‌ర‌గ‌లేదు.. వారిని ప‌ల్లెత్తు మాట అన‌లేదు.. మ‌రి ఉద్య‌మ స‌మ‌యంలో సెటిల‌ర్ల‌ను మ‌నం ఏదో అన్న‌ట్లుగా అవ‌న్నీ మ‌న‌సు లో పెట్టుకోవ‌ద్దంటూ ఈ మ‌ధ్య కాలంలో కేటీఆర్ గారు అన‌డం అస‌లు న‌చ్చ‌డం లేదు.. మ‌నం గ‌తంలో త‌ప్పు చేయ‌లేదు.. వ‌ర్త‌మానంలోనూ చేయ‌డం లేదు..
***********
ప్ర‌స్తుతం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లను చూస్తుంటే అప్ప‌ట్లో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అన్న మాట నిజ‌మేనేమో అన్న రీతిలో టీఆర్ఎస్ స‌హా అన్ని రాజ‌కీయ పార్టీల ప్ర‌చారం సాగుతోంది. హైద‌రాబాద్ అంతా మేమే(ఆంధ్రా సెటిల‌ర్లు) ఉన్నామ‌ని ల‌గ‌డ‌పాటి, ఇత‌ర ఆంధ్రా నేత‌లు అన్నారు.. ఆ స‌మ‌యంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎంత స‌ర్వే చేసినా 5 ల‌క్ష‌ల మందికి మించి లేర‌ని వాదించారు. మ‌రి హైద‌రాబాద్ లో కోటి మంది ఉంటే అందులో ఉన్న 5 ల‌క్ష‌ల మందిని ఊర‌డించ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్‌, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారం చేయ‌డం ఏంటి? ఈ త‌ర‌హా ప్ర‌చారం జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌నికి వ‌స్తుందేమో కానీ.. రానున్న రోజుల్లో యావ‌త్తు తెలంగాణ స‌మాజం ముందు మ‌ళ్లా మీరు ఏ మాట‌లు చెప్పి ప్ర‌చారానికి వెళ్తారో ఆలోచించుకోవాలి... సెటిల‌ర్ల‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి కూడా సిద్ధంగా ఉన్నామ‌నే రాజ‌కీయ నేత‌ల్లారా... ఏ త‌ప్పు చేశామ‌ని క్ష‌మాప‌ణ‌లు కోర‌దాం అనుకుంటున్నారు... తెలంగాణ స‌మాజాన్ని అను నిత్యం అవ‌మానించిన పెద్ద మ‌నుషులు క‌నీసం తాము త‌ప్పుగా మాట్లాడామ‌ని ఇప్ప‌టికీ అంగీక‌రించ‌డం లేదు.. అలాంటిది ఏ త‌ప్పూ చేయ‌ని మీరు మ‌నం అంతా గ‌తంలో త‌ప్పులు చేసిన‌ట్లుగా ఇప్పుడు మాట్లాడ‌టం అంటే అది తెలంగాణ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మే...
*****************
హైద‌రాబాద్ లో అంద‌రం సెటిట‌ర్ల‌మే అంటున్నారు కొంద‌రు.. తెలంగాణ జిల్లాల నుంచి వ‌చ్చిన వారు కూడా సెటిల‌ర్లే అన్న‌ట్లుగా మాట్లాడుతున్నారు.. తెలంగాణ జిల్లాల నుంచి వ‌చ్చి హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డిన వారు ఎప్పుడూ మేం సెటిల‌ర్ల‌మ‌ని భావించ‌లేదు.. మేం తెలంగాణ‌వాళ్లం, హైద‌రాబాదీలం అని మాత్ర‌మే భావిస్తున్నారు.. ఈ భావ‌న లోపించిన వారు మాత్ర‌మే తాము సెటిల‌ర్లం అని ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు.. ఇప్పుడు తెలంగాణ నేత‌లుకూడా తాము హైద‌రాబాద్ లో సెటిల‌ర్లం అన్న భావ‌న లో ఉంటే.. వారు తెలంగాణ లోని మిగ‌తా జిల్లాల ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతున్న‌ట్లే లెక్క‌.. !
నోట్ : హైద‌రాబాద్ లో ఏ ప్రాంతం నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డినా స‌రే తాము హైద‌రాబాదీల‌మ‌నో లేక తెలంగాణ వారిమి అన్న భావ‌న రాని వాళ్లే నా దృష్టిలో నిజ‌మైన సెటిల‌ర్లు..!!